వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందంను కోరారు.  సచివాలయానికి చేరుకున్న కేంద్ర బృందంతో గురువారం సాయంత్రం జరిపిన భేటీలో వరద నష్టంపై చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి వివరించారు.  పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందానికి ఆయన తెలియజేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు కేంద్ర బృందాలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే ఇవాళ గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి రూ6,882 కోట్ల అపార నష్టాన్ని, తీవ్ర కష్టాన్ని కలిగించిందని  చంద్రబాబు నాయుడు తెలిపారు.

భారీ వర్షాలు, వరదలు రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చాయని చెబుతూ రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడొద్దని కోరారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని వివరించారు. రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదని వివరించారు.

గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీని నిర్మించారని, ఇటీవల కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఇదే రికార్డు స్థాయి వరదని వివరించారు.  కృష్ణా నదికి 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని, పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారని వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారని తెలిపారు.

ప్రజలను తిరిగి సాధారణ స్థితిలోకి నిలబెట్టేలా కేంద్రం సాయం అందేలా చూడమని కేంద్ర బృందాన్ని కోరారు. వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయామని, మంత్రులు, అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు విజయవాడలోనే ఉండి పనిచేశామని తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయాన్నే సచివాలయంలా చేసుకుని పనిచేశామని చెప్పారు. సహాయక చర్యల కోసం కేంద్రం సాయాన్ని తీసుకున్నామని తెలిపారు. 

క్షేత్ర స్థాయిలో వరద సహాయక చర్యలను యుద్ధంలా చేపట్టామని పేర్కొంటూ నష్టపోయిన కౌలురైతులకూ సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్లు, ఇరిగేషన్‌ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరని తెలిపారు.

 కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోమ్‌ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం వరద ప్రాంతాల్లో తమ బృందం జరిపిన పర్యటన అనుభవాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఇంతస్థాయి వరదలు, బాధలు అనంతరం కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి సాంత్వన చేకూర్చాయని చెప్పారు.

 డ్రోన్ల ద్వారా ప్రభుత్వ సహాయక చర్యలు ఎంతో వినూత్నంగా సాగాయని పేర్కొన్నారు. భారీగా పంట నష్టం, మౌలిక సదుపాయాల పరంగా తీవ్ర నష్టం జరిగినట్లు క్షేత్ర స్థాయి పర్యటనలో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బుడమేరు వరదలపై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారని తెలిపారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత ఇలాంటి వరదలు వచ్చాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరారని వివరించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.