ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నది. డాక్టర్లు చర్చలకు రాకపోవడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ఆమె ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లను చర్చల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే సీఎం మమతా బెనర్జీ హాజరు కావాలని, చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. చర్చలకు మమతా బెనర్జీ హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే లైవ్ టెలికాస్ట్ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ల బృందం చర్చలకు హాజరుకాలేదు. కాగా, డాక్టర్లతో చర్చల కోసం ఎదురుచూసిన సీఎం మమతా బెనర్జీ అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసన చేస్తున్న వైద్యులను కలిసేందుకు తాను రెండు గంటల పాటు వేచి చూశానని తెలిపారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని విచారం వ్యక్తం చేశారు.
సమావేశాన్ని రికార్డ్ చేసేందుకు పూర్తి వ్యవస్థ కలిగి ఉన్నట్లు ఆమె తెలిపారు. పారదర్శకత కోసం రికార్డింగ్‌ను సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ్టితో సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పారు.
మరోవైపు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. ‘నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు. తిలోత్తమకు న్యాయం జరుగాలని నేను కోరుకుంటున్నా. సామాన్య ప్రజలు వైద్యం పొందాలని కోరుకుంటున్నా’ అని స్పష్టం చేశారు. వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని మమతా హామీ ఇచ్చారు. అలాగే చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.
“ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందుకే వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను లైవ్ ఇవ్వలేం. అయితే.. సమావేశానికి సంబంధించి వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేశాం. సుప్రీంకోర్టు అనుమతితో పుటేజీని వైద్యులకు అందజేస్తాం. చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు ప్రయత్నించా. వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక 27 మంది మృతి చెందారు” అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
“ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోను. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. వైద్యులంతా విధులకు హాజరుకావాలి” అని మమతా బెనర్జీ కోరారు. బెంగాల్ హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలు నెల రోజులు దాటాయి. ఇందులో భాగంగానే వారితో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
బుధవారం చర్చలకు రావాలని ఆహ్వానించగా 30 మంది ప్రతినిధులకు అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు షరతులు పెట్టారు. వారి షరతులను తిరస్కరించిన అధికారులు గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సెక్రటేరియెట్‌కు చేరుకున్నా వైద్యులు సమావేశానికి హాజరుకాలేదు.
కాగా, కొందరు స్వార్థ ప్రయోజనాలతో నిరసనకు సూత్రధారిగా ఉన్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులతో తమ ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. దీని వెనుక రాజకీయ రంగు ఉందన్నది సామాన్యులకు తెలియదని ఆమె చెప్పారు. రాజకీయ రంగు పులుముకున్న వ్యక్తులకు న్యాయం అవసరం లేదని, వారికి కుర్చీ మాత్రమే కావాలని పరోక్షంగా ఆమె బీజేపీపై మండిపడ్డారు.
అయితే, ఈ చర్చల ప్రతిష్టంభనకు కారణం ప్రభుత్వమే అని జూనియర్ డాక్టర్లు తప్పుబట్టారు. చర్చలను లైవ్ టెలీకాస్ట్ చేయకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని ఆరోపించారు. దానికి తమను నిందించడం దురదృష్టకరమని చెప్పారు. “సీఎం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. మేము చర్చలు జరగాలనే కోరుకున్నాం. కానీ, చర్చల ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. మా డిమాండ్లు న్యాయమైనవే. సమావేశం పారదర్శకత కోసమే మేము లైవ్ టెలీకాస్ట్ చేయాలని కోరాము.” ఓ జూనియర్ వైద్యుడు తెలిపాడు.
More Stories
సైనిక వీరులకు వందనం చక్కటి చొరవ
మహారాష్ట్రలో బంధువుల మధ్య మధ్య పోరు
నేటి నుండి 12 రోజుల పాటు కాప్ -29 సదస్సు