ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్

ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌ మోహన్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ కనుసన్నల్లోనే కార్గో బోట్లు కృష్ణా నదిలోకి కదిలి వచ్చాయని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. మూడు కౌంటర్‌ వెయిట్ల ధ్వంసానికి కారణమైన ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. 
 
ఇబ్రహీంపట్నం మండలం సూరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్‌, గొల్లపూడి గంగానమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిని అరెస్టు చేసి ఇక్కడి చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరుపరిచగా, వారికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు..

సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను నాలుగు పడవలు ఢీ కొట్టాయి. ఈ పడవలకు ఓ పార్టీ రంగులు వేసి ఉండడంతో అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బొట్లు ఢీకొట్టడంతో…67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్‌ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ బోట్ల వాటి యజమానులు రాకపోవడంతో ఇరిగేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఉందని పోలీసులు గుర్తించారు. వాటిని ఉద్దేశపూర్వకంగా దిగువకు వదిలారా? ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మూడు పడవలకు వైసీపీ రంగులు ఉండడంతో ఆ పార్టీ నేతల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లు ఉన్నట్లు ఇప్పటికే నివేదికలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు.

అయితే, పడవల ఘటనపై టీడీపీ, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఆ పడవల యాజమానులలో ఒకరైన కోమటి రెడ్డి రామ్మోహన్‌ మీ వాడే =, కాదు మీ వాడే అంటూ వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలతో రామ్మోహన్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నాయి. బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో కుట్రకోణం ఉందని టీడీపీ ఆరోపిస్తుంటే, వరదల సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందని, వాటి నుంచి డైవర్ట్ చేసేందుకు బోట్ల నాటకం ఆడుతున్నారని వైసీపీ విమర్శిస్తుంది.

మరోవంక, ప్రకాశం బ్యారేజి వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లును ఏర్పాటు చేశారు. 67, 69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజినీర్లు మరమ్మతులు పూర్తి చేశారు. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో స్టీల్‌తో తయారుచేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు బిగించారు. 

ఇరిగేషన్ చీఫ్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు సూచనలతో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తి చేశారు. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టింది. ఐదు రోజులు రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు.