కోల్​కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!

కోల్​కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!

కోల్​కతా ఆర్​జీ కర్ వైద్యురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్​ మీడియా ప్లాట్​ఫాంల నుంచి వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిది. ఈ కేసులో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేందుకు కోల్​కతా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారని మరోసారి ప్రశ్నించింది.  హత్యాచార ఘటనపై సోమవారం మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిరసన చేపడుతోన్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అల్టిమేటమ్‌ జారీ చేసింది. మరోవైపు కేసు దర్యాప్తుపై కొత్త నివేదికను సమర్పించాలని సీబీఐని నిర్దేశించిది. 

ఫొరెన్సిక్ నివేదిక కోసం మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్‌ను దిల్లీ ఎయిమ్స్‌కు పంపాలనుకుంటున్నట్లు సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. ‘ముందుగా పోలీసులు సేకరించిన శాంపిల్స్​ను బంగాల్​లోని సీఎఫ్​ఎస్​ఎల్​కు తరలించి పరీక్షలు చేశారు. ఈ నివేదిక మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ నమునాలను సీబీఐ ఎయిమ్స్​ పంపాలనుకుంటుంది.’ అని సుప్రీం కోర్టుకు తెలిపారు. కొత్త నివేదికను సెప్టెంబర్ 17న సమర్పించాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

ఆర్​జీ కర్ ఆసుపత్రి వద్ద రక్షణ కల్పిస్తోన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌)కు బంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సబ్బిందికి అన్ని వసతులు కల్పించాలని, వారికి అవసరమైన రిక్విజిషన్‌లు, గాడ్జెట్‌లను వెంటనే అందజేయాలని బంగాల్ ప్రభుత్వాన్ని, సీఐఎస్​ఎఫ్​ని ఆదేశించింది.

మరోవైపు సుప్రీంకోర్టుకు బంగాల్ ఆరోగ్యశాఖ కూడా ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో డాక్టర్ల నిరసనల వల్ల సకాలంలో వైద్యం అందక ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో తెలిపింది. అలాగే వైద్యుల భద్రతా చర్యల కోసం నిధులు మంజూరు చేశామని, జిల్లా కలెక్టర్లు దీనిని పర్యవేక్షిస్తారని అఫిడవిట్‌లో పేర్కొంది.

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శవపరీక్ష కోసం బాధితురాలి మృతదేహంతోపాటు ఆమె దుస్తులు కూడా పంపారా? అని ఒక న్యాయవాది ప్రశ్నించారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం అవసరమైన కీలక పత్రం గురించి సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఆరా తీశారు.

వైద్యురాలి తల్లిదండ్రులు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో వైద్యురాలి తల్లి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కేసు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం, పోలీసులు మాకు సహకరించలేదు. మొదటి నుంచి సాక్ష్యాలను నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారు. మాకు న్యాయం జరగనంత వరకు సామూహిక నిరసన కొనసాగించాలని నేను కోరుతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.