ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఎబివిపి

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఎబివిపి
త్వరలో జరగనున్న ప్రతిష్టాకరమైన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డుసు) ఎన్నికల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సిద్ధమవుతున్నది. ఎన్నికల్లో పోటీ చేసే ఏబీవీపీ అభ్యర్థుల ఎంపికతోపాటు సంబంధిత నిర్ణయాలు తీసుకొనేందుకు ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఎన్నికల కమిటీకి అధ్యక్షుడిగా ఎబివిపి ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు డా.తపన్ బిహారీ నియమితులయ్యారు.
 
ఇతర సభ్యులుగా జాతీయ బాలికల సమన్వయకర్త మను శర్మ కటారియా, జాతీయ కార్యదర్శి శివంగి ఖర్వాల్, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి హర్ష్ అత్రి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామ్ కుమార్, రాష్ట్ర సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శి విపిన్ ఉనియాల్, డుసు అధ్యక్షుడు తుషార్ దేధా, కార్యదర్శి అప్రజిత, నార్త్ జోన్ ప్రముఖ్ డా. లలిత్ పాండే ఉన్నారు.
 
కమిటీ ఏర్పాటుతో అభ్యర్థుల పేర్లపై చర్చలు ప్రారంభమయ్యాయి. డా.తపన్ బిహారీ మాట్లాడుతూ, “డుసు ఎన్నికలలో పోటీకి తగిన అభ్యర్థుల పేర్లను ఎన్నికల సంఘం చర్చించడం ప్రారంభించింది. గత సంవత్సరాల మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ‘డియుఎస్‌యు ఇన్ క్యాంపస్’ ప్రచారానికి విద్యార్థుల నుండి సానుకూల స్పందన లభించింది’ అని చెప్పారు.
 
ఎబివిపి చాలా సంవత్సరాలుగా విద్యార్థులకు నిరంతరం ప్రాతినిధ్యం వహిస్తుందని,  వారి ఆందోళనలు, హక్కుల కోసం వారితో దృఢంగా నిలబడిందని ఆయన చెప్పారు. సంభావ్య అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 
 
ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి హర్ష్ అత్రి ఇలా అన్నారు: “యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఎబివిపి యూనిట్లు విద్యార్థులతో చురుకుగా కనెక్ట్ అవుతున్నాయి.  రాబోయే మ్యానిఫెస్టో కోసం వారి అభిప్రాయం మరియు సూచనలను కోరుతున్నాయి. మేము విద్యార్థుల నుండి భారీ సానుకూల స్పందనను పొందుతున్నాము. ఈ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడంతో, చర్చలు ప్రారంభమయ్యాయి. మేము  అభ్యర్థుల పేర్లను త్వరలో విడుదల చేస్తాము”.