సీఎం పదవికి పోటీ పెరుగుతుండగానే మరోవైపు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ పాటిల్ మధ్య ఇదే విషయమై మాటల యుద్ధం జరిగింది. ఎంబీ పాటిల్ అభ్యర్థిత్వంపై శివానంద్ పాటిల్ స్పందిస్తూ.. ‘ఆయన కంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, ఆయన ఇంకొన్నాళ్లు వేచి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.
‘నాకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, అయితే సీనియారిటీ మాత్రమే కొలమానం కాదు’ అంటూ ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే సైతం సీఎం కావాలనే తన ఆకాంక్షను బయటపెట్టారు. ఒక వైపు సీఎం పదవి కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, బయటకు మాత్రం అందరు నేతలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారని చెప్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ముడా, వాల్మీకి, ఖర్గే ట్రస్టు వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురుదాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు.
ఇందులోభాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, పాత ఆరోపణలను తవ్వితీయాలని నిర్ణయించారు. కొవిడ్ నిర్వహణకు సంబంధించి రూ.7,200 కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ మైఖేల్ డిసన్హ కమిషన్ ఇచ్చిన మధ్యంతరం నివేదిక, ఎస్సై నియామక అక్రమాలపై జస్టిస్ బీ వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను బయటకు తీయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. తద్వారా తనపై వస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నించనున్నట్టు సమాచారం.
సిద్ధరామయ్యను తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజికవర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్‌కు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కిహోళి పేరును పరిశీలించవచ్చని తెలుస్తున్నది. సిద్ధరామయ్య సైతం జార్కిహోళి వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దళితులకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఖర్గే, పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది. ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
మరోవంక, పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంత మీడియా ఉండాలని కర్ణాటక కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మొదటి దఫాలో ఒక యూట్యూబ్ చానల్ ప్రారంభించబోతున్నది. బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని, 50 ఏండ్లుగా కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్తున్నారని, అందుకే తమ వాణి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ చానల్ ప్రారంభించనున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ తెలిపారు. రెండో విడతలో ఒక వార్తాపత్రిక ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు