పారాలింపిక్స్​లో 5 రోజుల్లోనే 24 పతకాలు

* ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ

పారిస్‌ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్​లో మన పారా అథ్లెట్లు అంచనాలను మించిపోయారు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 5 స్వర్ణాలు సహా భారత్ ఖాతాలో ఏకంగా 24 పతకాలు సాధించి పెట్టారు. బుధవారం జరిగిన వివిధ ఈవెంట్స్​లో సత్తాచాటి అందరినీ అబ్బురపరిచారు. షూటింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ తదితర విభాగాల్లో భారత ఆటగాళ్లు అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తున్నారు

షాట్‌పుటర్‌ ప్లేయర్ సచిన్‌ ఖిలారి భారత్‌కు 21 పతకాన్ని అందిస్తే, హర్విందర్‌ 22వ పతకాన్ని సాధించి పెట్టాడు. షాట్‌పుట్‌ ఎఫ్‌-46 విభాగంలో ఆడిన ఈ ప్రపంచ ఛాంపియన్‌, గుండును 16.32 మీటర్ల దూరానికి విసిరి రజత పతకాన్ని ముద్దాడాడు.

ఈ ఏడాది జపాన్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో 16.30 మీటర్లతో ఆసియా రికార్డు నెలకొల్పి ఛాంపియన్‌గా నిలిచాడు. ఇప్పుడు అంతకంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేసినప్పటికీ రజతమే దక్కింది. “నేను స్వర్ణానికి గురిపెట్టాను. కానీ అది జరగలేదు. నేను బెస్ట్​గా ఆడినప్పటికీ సంతృప్తిగా లేను. ఇంకా మెరుగ్గా విసరాల్సింది” అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. 

ఆర్చరీలో భారత ఆర్చర్‌ హర్వీందర్‌ సింగ్‌ సంచలన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో హర్వీందర్‌ సింగ్‌ 6-0తో లుకాస్‌ సిస్‌జెక్‌ (పోలండ్‌) ను ఓడించడంతో పారాలింపిక్స్‌ ఆర్చరీ ఈవెంట్స్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారత ఆర్చర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. టోక్యోలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా ఆర్చర్‌కు పారిస్‌లో పసిడి దక్కడం విశేషం.

ప్రస్తుతం భారత్‌ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు కలిపి మొత్తంగా 24 పతకాలు సాధించి పట్టికలో 13వ స్థానంలో ఉంది. అయితే షూటింగ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్ హెచ్ -1 విభాగంలో పతకాలు సాధిస్తారని భారీ అంచనాలు పెట్టుకున్న నిహాల్‌ సింగ్, రుద్రాంశ్‌లకు నిరాశ తప్పలేదు. వీళ్లిద్దరూ అర్హత రౌండ్లలో విఫలమయ్యారు. 522 స్కోర్‌తో నిహాల్‌ 19వ స్థానంలో పరిమితమవ్వగా, 517 స్కోర్‌తో రుద్రాంశ్‌ 22వ స్థానంలో నిలిచాడు. ఇక సైక్లింగ్‌లో అర్షద్‌ షేక్‌ 11వ, జ్యోతి గదారియా 16వ స్థానానికి పరిమితమయ్యారు.

ఇదిలా ఉండగా, 2020 పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్ భవీనా బెన్‌ పటేల్‌ ఈ సారి నిరాశపరిచింది. మహిళల క్లాస్‌-4 క్వార్టర్‌ ఫైనల్​లో 1-3తో చైనాకు చెందిన యింగ్‌ జౌ చేతిలో పరాజయం పాలైంది.

చారిత్రక ప్రదర్శనతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసిన పారా అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా మోదీ  పారా అథ్లెట్లతో ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడారు. పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అంచనాలకు మించి రాణించిన అథ్లెట్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనని కొనియాడారు.

బ్రూనైలో పర్యటిస్తున్న సమయంలో అధికారిక సమావేశాలు ముగిసిన అనంతరం ప్రధాన మంత్రి ప్రత్యేకంగా సంభాషించారు. పారిస్ క్రీడల్లో అసాధారణ ప్రతిభతో పతకాలు సాధించిన అథ్లెట్లు దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు. సుందర్ సింగ్, శరద్ కుమార్ తదితరులను అభినందిస్తూ ప్రధాని ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.