విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విలయం సృష్టించిన వర్షాల ధాటికి నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయని తెలిపారు. ప్రధానంగా 11 జిల్లాల్లో వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దురదృష్టవశాత్తు కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని కేంద్రమంత్రి విచారం వ్యక్తంచేశారు.
వర్షాలు, వరదల వల్ల ఆస్తులు కోల్పోవడం, పంట నష్టం భారీగా వాటిల్లిందని కిషన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే వరద ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని, వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారని ఆయన గుర్తు చేశారు.
ఏపీ, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్ష చేస్తుందన్న ఆయన, ఇప్పటికే దెబ్బతిన్న జాతీయ రహదారులను మరమ్మత్తు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించిందని తెలిపారు. అధికారులు వరద ముంపు గ్రామాల్లోకి వెళ్లి లెక్కలే తీయనప్పుడు ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 5,000 కోట్ల సాయం అడుగుతున్నారని ప్రశ్నించారు.
ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎవ్వరిపైన విమర్శలు చేయకుండా అందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముంపు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు పర్యటించి ఆహారం, తాగునీరు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ రూ.1345 కోట్లు ఉందని, ప్రస్తుతం ఆ నిధిని ఉపయోగించి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. అది అయిపోతే, తాత్కాలికంగా కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తామని చెప్పా రు.
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుందన్న ఆయన, రాష్ట్ర సర్కార్ రూ.5 లక్షలు ప్రకటించటం పట్ల సందేహం వెలిబుచ్చారు. కేంద్రం ఇచ్చే మొత్తాన్ని కలుపుకుని ముఖ్యమంత్రి రూ.5 లక్షలు ప్రకటించారా? అని సందేహం వ్యక్తం చేశారు. జీవనోపాధి కోల్పోయిన వాళ్లకు ‘మనరేగా’ కింద పనులు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అదేవిధంగా ఆవులు, గొర్రెలకు కూడా కేంద్రం పరిహారం అందిస్తుందని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే ప్రధాన మంత్రి పర్యటిస్తారని చెప్పారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం