ఖమ్మంలో హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల కార్లపై రాళ్లతో దాడి

ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్‌ రావు, పువ్వాడ అజయ్, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు.. పర్యటించారు. ఈ క్రమంలోనే హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నేతల కార్లపై రాళ్లతో దాడి చేశారు. 
 
ఈ ఘటనలో హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరరావు వాహనాలు ధ్వంసమయ్యాయి. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతున్న సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.  మంచికంటి న‌గ‌ర్‌లో వ‌ర‌ద బాధితుల‌కు బీఆర్ఎస్ నేతలు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తుండ‌గా  కాంగ్రెస్ కార్యక‌ర్తలు అడ్డుకోవటంతో ఘర్షణ జరిగింది. 
 
ఈ దాడిలో పలువురు బీఆర్ఎస్ నేతలకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ కార్యక‌ర్త సంతోష్ రెడ్డి కాలికి తీవ్ర గాయమవగా, అత‌న్ని వెంటనే ఆస్పత్రికి త‌ర‌లించారు. చాలాసేపు ఘర్షణ జరిగిన తర్వాత పోలీసులు కల్పించుకుని ఆందోళనకారులను నిలువరించటంతో పరిస్థితి సద్దుమణిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగిందని తెలిపారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయటంతో రేవంత్‌ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం యంత్రాంగం సకాలంలో స్పందించలేదని,  ప్రభుత్వం స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్ల, ప్రజ‌ల‌ను అల‌ర్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్రాణ, ఆస్తి న‌ష్టం పెద్ద ఎత్తున జ‌రిగిందని మండిపడ్డారు.

 
పార్టీ త‌ర‌పున వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అందించేందుకే తాము వచ్చామని వ‌చ్చామని, ఈ క్రమంలో తమపై దాడి చేపించటం దారుణమని హరీష్ రావు మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన? అంటూ ప్రశ్నించారు. బాధితులు సాయం అడిగితే లాఠీఛార్జ్ చేపిస్తారని, ఇప్పుడు వరద బాధితులకు సాయం చేసి వారికి అండగా నిలబడేందుకు వస్తే దాడులు చేస్తారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ గుండాలు దాడికి పాల్పడడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సాయం చేతగాక సాయం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే.. బాధితులకు అండగా నిలబడడం తప్పా అంటూ ప్రశ్నించారు.