రైతులకు రూ.14వేల కోట్లతో కేంద్రం 7 కొత్త పథకాలు

వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏడు కీలమైన పథకాలను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. సుమారు 14వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.  ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. 
 
వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విద్య, వాతావరణ మార్పులు, సహజ వనరుల నిర్వాహణ, డిజిటలైజేషన్‌, పాడిపరిశ్రమ, ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలే లక్ష్యంగా ఈ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు. రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం, క్రాప్ సైన్స్ కోసం రూ.3,979 కోట్లు కేటాయించింది. వ్యవసాయ విద్య, నిర్వహణను బలోపేతం చేసేందుకు రూ.2,291 కోట్ల విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
 
పశువుల సుస్థిర ఆరోగ్యం, వాటి ఉత్పత్తి కోసం రూ.1,702 కోట్లతో స్కీమ్‌కి సైతం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధికి రూ.860 కోట్లతో మరో బృహత్తర పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతోపాటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు రూ.1,202 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. 
 
అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి రూ.1,115 కోట్లు వెచ్చించనున్నారు. ఏడు పథకాలకు రూ.13,960 కోట్లకుపైగా నిధులు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్‌ వివరించారు.  కాగా, ముంబయి, ఇందౌర్ మధ్య 309 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. 
 
రూ.18,036 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2028-29నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఉజ్జయిన్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్‌ ఆలయం సహా అనేక పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ కొత్త రైలు మార్గం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మార్గంలో 30 కొత్త రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.గుజరాత్‌లోని సనంద్‌లో కేనెస్‌ సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 3,307 కోట్ల పెట్టుబడితో రోజుకు 63లక్షల చిప్‌లు తయారీ సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయన్నట్లు కేంద్రమంత్రి వివరించారు. విద్యుత్‌ రంగానికి సంబంధించిన, ఆటోమొబైల్స్‌, గృహోపకరణాల్లో ఉపయోగించే విద్యుత్‌ ఆధారిత చిప్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుందని ఆయన చెప్పారు.