సీబీఐ కస్టడీకి మాజీ ప్రిన్సిపాల్ ఘోష్

* బెంగాల్ ప్రభుత్వం సస్పెన్షన్
 
కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణలపై అరెస్టయిన మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు ఎనిమిదిరోజుల కస్టడీకి పంపింది. మంగళవారం మధ్యాహ్నం ఘోష్‌ను నిజాం పాలెస్‌లోని సీబీఐ కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చిన సీబీఐ అలీపూర్‌లోని సీబీఐ ప్రత్యేకు తరలించింది. కాగా, బెంగాల్ ఆరోగ్య శాఖ ఆయనను అంతర్గత విచారణ అనంతరం ప్రభుత్వ సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
 
సందీప్‌ను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. ఆర్థిక అవినీతి కేసులో అరెస్టయిన సందీప్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సి ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. భారీ అవినీతి ఉందని, అందులో ఎవరెవరు ఉన్నారనేది తేల్చాల్సి ఉందని సీబీఐ కోర్టుకు చెప్పింది. వాదనలన్నీ విన్ని కోర్టు సందీప్‌ ఘోష్‌ను ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.

మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. ఘోష్ హయాంలో మెడికల్‌ కాలేజీ కమ్‌ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్‌లో ఘోష్ పేరును చేర్చిన కొద్ది రోజులకే ఆయనను అరెస్టు చేసింది. 

ఆగస్టు 9న ఆర్‌జీ కర్ దవాఖానలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై అత్యాచారం, హత్య కేసులో ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత ఆర్థిక అవకతవకలపై వెలుగులోకి వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సందీప్ ఘోష్‌తోపాటు మూడు ప్రైవేట్ సంస్థల పేర్లు సైతం ఉన్నాయి. సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఉన్న నిజాం ప్యాలెస్ కార్యాలయానికి తరలించి,  అక్కడ ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించారు.

ప్రిన్సిపాల్‌గా చేసిన సందీప్ ఘోష్‌పై తీవ్రమైన ఆరోపణలే ఉన్నాయి. క్లెయిమ్‌ చేయని మృతదేహాలను విక్రయించడంతో పాటు బయోమెడికల్ వ్యర్థాలు అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకోవడం తదితర ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది. అవినీతి కేసులో ఘోష్ నివాసంలో ఆగస్టు 25న సీబీఐ సోదాలు నిర్వహించింది. 

మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మాజీ ప్రిన్సిపాల్, మరికొందరి హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఇటీవల సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ సస్పెండ్ చేసింది.