గత ఏడాది తమకు అందిన అవినీతి కేసుల్లో ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగులపై ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ తెలిపింది. తర్వాత డిల్లీలోని స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులపై ఫిర్యాదులు అందాయంటూ సివిసి వార్షిక నివేదిక విడుదల చేసింది. గత ఏడాది అవినీతికి సంబంధించి 74,203 ఫిర్యాదులు అందగా , వాటిలో 66,373 ఫిర్యాదులను పరిష్కరించామని, 7,830 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.
తమకు రైల్వే ఉద్యోగులపైనే ఏకంగా 10,447 ఫిర్యాదులు వచ్చాయని సివిసి వివరించింది. దేశ రాజధాని ప్రాంతం ఎన్ సి ఆర్ మినహా డిల్లీలోని స్థానిక సంస్థలపై 7,665 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. వాటిలో ఢిల్లీ పారిశ్రామిక, మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్, ఢిల్లీ జల్ బోర్డు, పర్యాటక, రవాణా అభివృద్ధి కార్పొరేషన్, రవాణా కార్పొరేషన్, దిల్లీ ట్రాన్స్‌కో, పవర్ జనరేషన్, మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందినట్లు వివరించింది.
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై 6,638 ఫిర్యాదులు వచ్చాయని, ఢిల్లీ పోలీసులపై 3,325 ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇక, ప్రభుత్వరంగ బ్యాంకులపై 7,004 ఫిర్యాదులు రాగా 6,667 పరిష్కరించామని, 337 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. కేంద్ర బొగ్గు శాఖ ఉద్యోగులపై 4,420, కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగులపై 3,217 ఫిర్యాదులు వచ్చాయని సివిసి వెల్లడించింది.
పెట్రోలియం శాఖ ఉద్యోగులపై 2,749, హోంశాఖ ఉద్యోగులపై 2,309, రక్షణ శాఖ ఉద్యోగులపై 1,861 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉద్యోగులపై 1828, టెలీకమ్యూనికేషన్ల విభాగం ఉద్యోగులపై 1457 ఫిర్యాదులు వచ్చాయని, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ఉద్యోగులపై 1205 ఫిర్యాదులు అందాయన వివరించింది.
మరోవైపు, సిబిఐ దర్యాప్తు చేస్తున్న 6,900 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సివిసి తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇందులో 361 కేసులు 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నట్లు వివరించింది.2,461 కేసుల్లో విచారణ పదేళ్లు దాటిపోయిందన్న సివిసి ఇది ఆందోళనకరమని పేర్కొంది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ