మరోవైపు విజయవాడ-వరంగల్ మధ్యలో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లింపు కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తుతున్నది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన దరిమిలా.. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను సూచించారు. క్షేత్రస్థాయిలో అత్యవసర బృందాలు, ఎస్పీటీ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ముందస్తుగా సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ తెలిపారు.
భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతెనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఇండ్లలోకి నీరు చేరింది. రహదారులు చెరువులను తలపించాయి. కరీంనగర్‌లో శనివారం కురిసిన భారీ వర్షానికి 150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం పైకప్పు కూలిపోయింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయం స్లాబ్ పైకప్పు, గోడలు విరిగి పడ్డాయి.
నల్లగొండలోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లోకి వర్షపు నీరు చేరి రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద కొత్త వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే ఓసీ-2, 3 గనుల్లో వరద నీరు చేరి బురదయమై బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు దాదాపు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
భారీ వర్షాల్లో బాధితులను రక్షించేందుకు అగ్నిమాపకశాఖలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 50 మంది సిబ్బందిని 24 రెస్క్యూ బోట్లతో సంసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో బోట్స్‌తో పాటు నీటిని తోడే పంప్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్లు ఇతర రెస్క్యూ సామగ్రితో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల కోసం అత్యవసరమైతే ప్రత్యేక బృందాలను పంపుతామని వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. ఏపీలోని జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తున్నందున వాహనాలను నార్కట్‌పల్లి – అద్దంకి రహదారి మీదుగా మిర్యాలగూడ, వాడపల్లి, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని రాయినిగుడెం వద్ద ఖమ్మం బైపాస్ మీ దుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ఖమ్మం, సత్తుపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లొచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి