రాత్రి పూట డ్యూటీ అంటే భయపడుతున్న మహిళా వైద్యులు

కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు పలువురు వైద్యులు అభద్రతలో భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మూడింట ఒకవంతు మహిళా వైద్యులు రాత్రివేళల్లో పనిచేయడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు భారత వైద్య మండలి (ఐఎంఏ) సర్వేలో వెల్లడైంది. 

దాదాపు 3885 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేల్లో దాదాపు 35 శాతం మంది వైద్యులు రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. బాధితురాలు విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి జరగడం వైద్యుల్లో తీవ్ర అలజడి రేపింది. దీంతో నైట్ షిఫ్ట్‌లు చేయడానికి వైద్యులు భయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. 

ప్రధానంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది.  సర్వేలో పాల్గొన్న వారిలో 24.1 శాతం మంది వైద్యులు నైట్‌ డ్యూటీ సురక్షితం కాదని చెప్పగా, 11.4 శాతం మంది అస్సలు సురక్షితం కాదని చెప్పారు. ఇలా చెప్పిన వారిలో మహిళలే అధికం.

భయపడుతున్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులే ఉన్నట్లు వివరించింది. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులకు 45 శాతం ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్‌లు లేవు. దీంతో నైట్‌ డ్యూటీలో ఉంటున్నవారు తీవ్ర అభద్రతలో ఉంటున్నామనే భావనలో ఉన్నారు. కచ్చితంగా తమకు డ్యూటీ రూమ్‌ ఏర్పాటు చేయాలని వారు కోరారు.

డ్యూటీ రూమ్‌ ఉన్నప్పటికీ.. తమకు గోప్యత ఉండడం లేదని, భారీ సంఖ్యలో వస్తున్న రోగుల కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు.  డ్యూటీ రూమ్‌లు ఉన్నచోట అవి సరిపోవడం లేదని, గోప్యత లేకపోవడం, తాళాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పింది. 

అందుబాటులో ఉన్న మూడింట ఒకవంతు డ్యూటీ రూమ్‌లలో అటాచ్డ్​ బాత్‌రూమ్‌లు లేవని సర్వేలో తేలింది. వాటికోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 53 శాతం డ్యూటీ రూమ్‌లు వార్డులు, అత్యవసర చికిత్సా విభాగాలకు చాలా దూరంలో ఉన్నాయని ఐఎంఏ అధ్యయనంలో వెల్లడైంది. 

ఇదే సమయంలో వారు పలు భద్రతా చర్యలను సూచించినట్లు తెలిపింది.  రాత్రిపూట విధులు నిర్వర్తించే వైద్యుల రక్షణ కోసం శిక్షణ పొందిన సెక్యూరిటీ సిబ్బందిని నియమించడంతోపాటు సీసీటీవీ కెమెరాలు బిగించాలని, పూర్తిగా వెలుతురు ఉండేలా లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సర్వేలో పాల్గొన్న వైద్యులు కోరారు. 

కేంద్ర రక్షణ చట్టం (సీపీఏ) అమలు చేయడంతోపాటు రోగుల అటెండెంట్స్‌ సంఖ్యను నియంత్రించడం, అలారం వ్యవస్థను ఏర్పాటు చేయడం, తాళాలు వేయగలిగే సురక్షితమైన డ్యూటీ రూములు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యులు డిమాండ్‌ చేసినట్టు ఐఎంఏ సర్వే వెల్లడించింది.

ఆత్మ రక్షణ కోసం చిన్నపాటి ఆయుధాలను తీసుకు వెళ్తున్నట్టు సర్వేలో కొందరు తెలిపారు. తన హ్యాండ్‌ బ్యాగులో చిన్నపాటి కత్తితో పాటు మిరియాల ద్రావకాన్ని కూడా పెట్టుకుంటున్నట్టు ఓ మహిళా వైద్యురాలు తెలిపారు. రోగుల బంధువులు కొందరు మద్యం తాగి, మరికొందరు మాదద్రవ్యాల మత్తులో జోగుతూ వైద్యులను బెదిరిస్తున్నారని మెజారిటీ వైద్యులు ఫిర్యాదు చేశారు. వీరిని కట్టడి చేయాలని కోరారు.

మహిళా వైద్యులను కొందరు తాకరాని చోట తాకుతున్నారు. రోగుల సమూహం ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రతను ప్రశ్నిస్తే.. యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. చులకనగా చూస్తున్నాయి. జూనియర్‌ వైద్యులపై దాడులు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి.

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన వేళ వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు  ఐఎంఏ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన 3885 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. వీరిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు ఉన్న వైద్యులు ఉన్నారు. 61 శాతం మంది ఇంటర్న్‌లు లేదా పీజీ వైద్యవిద్యార్థులు ఉన్నారు.