బాలికల వసతి గృహం వాష్‌రూములో కెమెరాల కలకలం

బాలికల వసతి గృహం వాష్‌రూములో కెమెరాల కలకలం
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్‌ కళాశాల బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లలో ‘హిడెన్‌’ కెమెరాల కలకలం రేగింది. బాలికల వసతి గృహంలోని మూడు బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారనే అంశంపై గత రెండురోజులక్రితం విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
అయితే, దీనిపై తక్షణమే స్పందించాల్సిన యాజమాన్యం.. విచారణ చేస్తున్నామని, చర్యలు తీసుకుంటామని చెబుతూ కాలయాపన చేసిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా వసతిగృహం నుంచి బయటకు వచ్చి వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ‘ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలు చేశారు. వసతిగృహంలోని వాష్‌రూమ్‌కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ అంశం సోషల్‌ మీడియా ద్వారా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సూచించారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం రోజు రోజంతా విద్యార్థినులు ఆందోళన చేశారు.
 
కళాశాలలో కొందరు విద్యార్థినీ, విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలు బాలికల వసతిగృహంలోని వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేసేవరకు వెళ్లినట్లు సమాచారం. విద్య్థార్థినులు వాష్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో హిడెన్‌ కెమెరాల ద్వారా తీసిన వీడియోలు అదే కళాశాలకు చెందిన బాలుర వసతిగృహంలోని కొందరికి అందినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 300 వరకు వీడియోలు తీశారని పేర్కొన్నారు.
 
విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల వసతి గృహానికి వెళ్లి వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. హిడెన్‌ కెమారాలు ఏర్పాటు చేశారనే అంశంలో అనుమానితుడి లాప్‌ల్యాప్‌, అతనికి సహకరించిందనేఆరోపణలున్న మరో విద్యార్థినికి చెందిన ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు ఘటనా స్థలానికి వెళ్లారు. విద్యార్థినీ, విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదిలావుంటే, కళాశాల వాష్‌రూములలో కెమెరాలు పెట్టిన వ్యక్తుల ను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సెప్టెంబర్‌ మూడో తేదీ వరకూ కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
 
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా కేసు తీసుకుంది. దీనిపై కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు చైర్‌పర్సన్‌ గజ్జెల వెంకటలక్ష్మి తెలిపారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.