
భారత్‌లోకి ఉగ్రవాదాన్ని పంపిస్తూ, దాడులకు కారణం అవుతున్న పాకిస్తాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. చర్చలు కాకుండా ఇక నుంచి పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరించాలన్న దానిపైనే ప్రస్తుతం భారత్ ఆలోచన చేస్తోందని వెల్లడించారు. ఢిల్లీలో తాజాగా నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జై శంకర్ భారత్, పాక్ సంబంధాల గురించి స్పందించారు.
పాకిస్తాన్ విషయంలో భారత్ ఏ రకంగా స్పందిస్తుంది అనే విషయంపై మాట్లాడిన జై శంకర్ భారత్ పట్ల పాక్ వ్యవహార శైలి ఆధారంగానే ఆ దేశం పట్ల భారత్ తీసుకునే చర్యలు, నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఒక వేళ భారత్ విషయంలో పాక్ కుట్రలు, కుటిల యత్నాలకు ప్రయత్నిస్తే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
పాకిస్థాన్‌పై భారత్ వైఖరి గురించి అనేది పాక్ వ్యవహరించే తీరును బట్టి ఉంటుందని, అందుకు తగిన విధంగా బదులిస్తామని జై శంకర్ చెప్పారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా భారత్ చర్యలు చేపడుతుందని వివరించారు. ‘పాకిస్థాన్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది. మన దేశం పట్ల పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తే.. మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్ నుంచి వచ్చే చర్య సానుకూలమైనా ప్రతికూలమైనా తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుంది’ అని జై శంకర్ స్పష్టం చేశారు.
పాక్ భూభాగంలో జరుగుతున్న ఉగ్ర కుట్రలు, భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంపై ఆ దేశం తగిన పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఇక గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో తరచుగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనల కారణంగా భారత్, పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనేది ఒక ముగిసిన అధ్యాయం అని జైశంకర్ తెలిపారు. మరోవైపు, ఈ ఏడాది మార్చిలో సింగపూర్‌లో పర్యటించిన జై శంకర్ పాక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ ఒక ఫ్యాక్టరీ లాగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అయితే ఉగ్రవాదాన్ని ఉపేక్షించే స్థితిలో ప్రస్తుతం భారత్ లేదని స్పష్టం చేశారు. ఈ ఉగ్రవాద సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని పేర్కొంటూ ప్రతి దేశం ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందని చెప్పారు. కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుందని జై శంకర్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు పొరుగు దేశం బంగ్లాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు జై శంకర్ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమయానుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. పొరుగుదేశాలతో సమస్యలు ఉండని దేశమంటూ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశాల మధ్య పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉంటుందని జై శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడినప్పటి నుంచి ఆ దేశం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులతో వారి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ప్రధాని మోదీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మాట్లాడారని, మైనారిటీలు, హిందువుల భద్రతకు ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని జై శంకర్ పేర్కొన్నారు.
మాల్దీవులు అధ్యక్షుడు మొహహ్మద్ మయిజ్జు హయాంలో మాల్దీవులతో సంబంధాల గురించి మాట్లాడుతూ, వారి విధానంలో నిలకడ లేకపోవడం, ఒడిదుడుకులు వంటివి ఉన్నా ఆ దేశంతో ఇండియా లోతైన సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. చైనా అనుకూలవాదిగా మయిజ్జుకు పేరుడంతో ఇటీవల కాలంలో ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాల్లో ఒకింత ఇబ్బందులు తలెత్తాయి. అయితే, భారత్ తమకు అత్యంత కీలక భాగస్వామి అని ఇటీవల జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా మయిజ్జు స్పష్టం చేశారు.
More Stories
`ఒకే దేశం- ఒకే ఎన్నిక’ జెపిసి తొలి భేటీ నేడే
ప్రపంచ నాగరికత కోసం సనాతన ధర్మాన్ని గౌరవించాలి
అమెరికాలో భారత్ వ్యతిరేక సెనేటర్ తో రాహుల్ భేటీపై బిజెపి ఆగ్రహం