రాహుల్ కు భార్య, పిల్లలంటూ `బ్లిట్జ్’ కథనంపై స్పందించరే!

రాహుల్ కు భార్య, పిల్లలంటూ `బ్లిట్జ్’ కథనంపై స్పందించరే!

దేశంలో సెబీమీద, ఆదానీ మీద, సుప్రీంకోర్టు మీద, భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ హిండెన్‌ బర్గ్‌ రాసే వార్తలను మాత్రం నమ్ముతారని బిజెపి నేత, మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు ధ్వజమెత్తారు. మరి, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు.

బ్లిట్జ్ లో రాహుల్ గాంధీ కి భార్య ఉందని, పిల్లలు ఉన్నారని ఫొటోలతో సహా వార్త రాశారని చెబుతూ  బ్లిట్జ్ లో వచ్చిన వార్తను ఎందుకు నమ్మడం లేదు? అని ప్రశ్నించారు. బ్లిట్జ్ లో వచ్చిన వార్తకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఫోటో లో ఉంది రాహుల్ గాంధీ సతీమణా కాదా? అని నిలదీశారు. దాని నుండి దృష్టి మళ్లించేందుకే హిండెన్ బర్గ్ చేస్తున్న కుట్రలకు అనుబంధంగా రాహుల్ ఇదంతా చేస్తున్నారని బిజెపి ఎంపీ ఆరోపించారు.

బ్లిట్జ్ లో వచ్చిన వార్తపై విచారణ జరిపించమని రాహుల్ గాంధీకి అడిగే దమ్ము ఉందా? అని రఘునందన్ రావు సవాల్ చేశారు. బ్లిట్జ్ రాసిన వార్తలపై సిట్ వేసి విచారణ జరిపించే ధైర్యముందా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బ్లిట్జ్ పేపర్ పై సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రులతో లేఖలు రాయించగలరా? అంటూ ఎద్దేవా చేశారు. 

బ్లిట్జ్ కధనాన్ని స్వయంగా రాహుల్ కు అందించేందుకు ఢిల్లీ వీడుతున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ జర్నలిస్టులు రాసే వార్తలే నిజమంటూ రాహుల్ భావిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల్లో చావుదెబ్బ తిని అహంకారపూరితంగా దేశంలోని వ్యవస్థల మీద దాడిని రాహుల్ గాంధీ కొనసాగించాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హిండెన్ బర్గ్ రాసిన వార్తలపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.  అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రేవంత్ రెడ్డి అదానీని రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు ఆహ్వానించినట్టు? అంటూ మండిపడ్డారు.

గతంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని రాజీవ్ గాంధీ తనను కోరారని అదానీ చెప్పారని, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేలా ఢిల్లీకి ఆహ్వానించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. హిండెన్ బర్గ్ ను అడ్డం పెట్టుకొని ఏం చేద్దామని అనుకుంటున్నారని నిలదీశారు. హిండెన్ బర్గ్ కు ఉన్న క్రెడిబిలిటీ ఏంటో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేయాలని కుట్ర చేస్తున్నవారికి కాంగ్రెస్ నాయకులు భజన చేస్తున్నారని బిజెపి ఎంపీ విమర్శించారు.  జార్జ్ సోరెస్ లాంటి వారు వ్యాపార సామ్రాజ్యంలో అడ్డగోలుగా సంపాదించేందుకునేందుకు తప్పుడు వార్తలు రాస్తే రాహుల్ గాంధీ లాంటి వారు ధర్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెబీ హిండెన్ బర్గ్ కు నోటీసులు జారీ చేస్తే సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ వంటి వారు సెబీని నమ్మరు, అదానీపై నమ్మకం లేదని,  కాని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదానీతో కలిసి వ్యాపారాలు చేస్తారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. విదేశాల్లో అదానీతో కలిసి తిరుగుతూ, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారని, మళ్లీ భారత్ కు వచ్చిన తర్వాత అదానీపై ఆరోపణలు గుప్పిస్తారని అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

సెబీ అధ్యక్షురాలు మాధవి బుచ్‌ ఆమె భర్త ధవళ్‌ బుచ్‌ కు ఆదానీ కంపెనీలో షేర్లు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించాలనుకోవడమే రాహుల్ గాంధీ ఉద్దేశం అని ఆయన విమర్శించారు.  రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు భారత షేర్ మార్కెట్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారా? భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడిని చెప్తూ వివరాలతో సహా కోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారని ఆయన గుర్తు చేశారు.  రాహుల్ బ్రిటన్ లో కంపెనీని స్థాపించారని, ఆయన బ్రిటన్ పౌరుడని వివరాలు సమర్పించారని తెలిపారు. దీంతో పౌరసత్వం తీసేస్తారేమోననే ఉద్దేశంతో రాహుల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

అదానీ-హిండెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ ఇప్పటికైనా గౌరవించాలని హితవు చెప్పారు. లేదంటే రానున్న రోజుల్లో జవాబుదారీగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.