కోల్‌కతా వైద్యురాలి పేరు, ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించండి

కోల్‌కతా వైద్యురాలి పేరు, ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించండి
* రాష్ట్రపతితో బెంగాల్ గవర్నర్ భేటీ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కోల్‌కతా కేసుపై విచారణ చేసింది.  లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

‘సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత వ్యక్తి గుర్తింపు, మృతదేహం ఛాయాచిత్రాలను ప్రచురించాయి. అందుకే  కోర్టు నిషేధాజ్ఞను జారీ చేయవలసి ఉంది. అని అన్ని సామాజిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి బాధితురాలి ఫొటోలు, పేరు’ తొలగించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.

ట్రైనీ డాక్టర్ గుర్తింపును సోషల్ మీడియాలో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది కిన్నోరి ఘోష్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. బాధితురాలి పేరు, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ సహా ఎలక్ట్రానిక్,  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వ్యాపించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరణించినవారి పేరు సోషల్ మీడియాలో ప్రచురించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘ఛాయాచిత్రాలు, వీడియో క్లిప్‌లు మీడియా అంతటా ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైనది.’ అని కోర్టు అభిప్రాయపడింది. 2018లో నిపున్ సక్సేనా కేసు తీర్పులో అత్యున్నత న్యాయస్థానం ఇలా ఆదేశించింది. ‘ఎవరూ బాధితురాలి పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో ముద్రించకూడదు, ప్రచురించకూడదు. వారి వాస్తవాలను బహిర్గతం చేయకూడదు.’ అని  సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ మంగళవారం ఢిల్లీలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కడ్‌లతో సమావేశమయ్యారు. కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ భేటీలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. బెంగాల్‌లో నెలకొన్న పరిస్థితులను ధన్కడ్‌, ముర్ములకు గవర్నర్‌ వివరించారు. కాగా గవర్నర్‌ తన పర్యటనలో భాగంగా అమిత్‌ షా, జేపీ నడ్డాలతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.