జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి తొలి విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థుల నామినేషన్ గడువు ఆగస్ట్ 27వ తేదీతో ముగియనుంది. ఆగస్ట్ 28వ తేదీతో అభ్యర్థి నామినేషన్ పరిశీలన గడువు తీరనుంది.

అదే విధంగా ఆగస్ట్ 30వ తేదీతో అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరగనుంది.  ఈ తొలి విడతలో 24 అసెంబ్లీ స్థానాలు.. పంపొరి, త్రల్, పుల్వామా, రాజ్‌పురా, జైనపూరా, షోపియాన్, డిహెచ్ పొరా, కుల్గాం, దేవసార్, దూర్, కొకెర్నాగ్ (ఎస్టీ), పశ్చిమ అనంత్‌నాగ్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్బెహరా, షాంగూస్- అనంతనాగ్ తూర్పు, పెహాల్గామ్, ఇంద్రవాల్, కిష్ట్వారా, పెద్దర్ నాగ్సెనీ, భద్రవాహ్, దోడా, దోడా పశ్చిమ, రామబన్, బనిహెల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఆగస్ట్ 16వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీకి మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది.  సెప్టెంబర్ 18వ తేదీన తొలి విడత పోలింగ్, సెప్టెంబర్ 25వ తేదీన రెండో విడత పోలింగ్, ఆక్టోబర్ 1వ తేదీన మూడో లేదా తుది విడత పోలింగ్ జరగనుంది. ఆక్టోబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో జమ్మూ కశ్మీర్ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనే విషయం తేటతెల్లం కానుంది.

ఇక 2014లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి చిట్ట చివరిగా ఎన్నికలు జరిగాయి. రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ.. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో ఈ ఆర్టికల్ రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.