మద్యం కుంభకోణంలో రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఎట్టకేలకు చిక్కారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులోని నివాసం యలహంక ప్యాలెస్ సమీపంలోని ఒక హోటల్‌లో వాసుదేవ రెడ్డి బస చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించి పిలిపించి అధికారులు విచారించారు.
మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి వాసుదేవ రెడ్డి అని నిర్ధారణకు సీఐడీ అధికారులు వచ్చారు. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు, ధరలు నిర్ధారణ వంటి అంశాల్లో వాసుదేవ రెడ్డిది కీలకపాత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. కమీషన్లు కోసం ధరలు పెంచారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఆ కమీషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సీఐడీ అధికారుల విచారణలో తేలింది.
వీటన్నింటిపై వాసుదేవ రెడ్డిను పిలిపించి సీఐడీ అధికారులు విచారించారు. బెంగళూరులోనే సీఐడీ బృందాలు ఇంకా సోదాలు చేస్తున్నాయి. వాసుదేవ రెడ్డి చెప్పిన వివరాల మేరకు రికార్టులను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి సాక్ష్యాలు లభించిన తర్వాత మాత్రమే వాసుదేవ రెడ్డినీ అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తే బెయిల్ పొందే అవకాశం ఉంటుందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
పూర్తి ఆధారాలు లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సీఐడీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా వాసుదేవ రెడ్డి సీఐడీ అదుపులో ఉన్నారని వార్తలు వస్తుండటంతో ఆయన తాము అరెస్ట్ చేయలేదని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వాసుదేవరెడ్డిను అవసరమైనప్పుడు పిలిపించి సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలివేస్తున్నట్లు సమాచారం. వాసుదేవ రెడ్డిను తాము అరెస్ట్ చేయలేదని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు.
జూన్ రెండో వారంలో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న వాసుదేవ రెడ్డి ఇంట్లో అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కొన్ని ముఖ్యమైన ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్ పాలసీ, కొత్త బ్రాండ్ల విక్రయం, ఆఫ్‌లైన్‌లో భారీ మొత్తంలో మద్యం విక్రయాలు, కొత్త బ్రాండ్‌ల యజమానుల వివరాలు, సంబంధిత లావాదేవీలపై అధికారులు వివరాలు సేకరించారు.
వాసుదేవ రెడ్డి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు అధికారి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఏరికోరి ఆయనను రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. కీలకమైన మద్యం అమ్మకాల బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి