మోదీకి బంగ్లా అధినేత యూనస్​ ఫోన్​ కాల్

మోదీకి బంగ్లా అధినేత యూనస్​ ఫోన్​ కాల్
 
* హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ

బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్​ యూనస్‌ఖాన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. ప్రొఫెసర్‌ యూనస్‌ ఖాన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు మోదీ శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.  ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ కోసం భారత దేశ మద్దతు కొనసాగుతుందని యూనస్‌కు స్పష్టం చేసినట్లు మోదీ ట్వీట్​లో తెలిపారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిని మోదీ ప్రస్తావించారు.  హింస నెలకొన్న బంగ్లాదేశ్‌లో జనజీవనం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. పొరుగు దేశంలో ఉన్న హిందువులు ఇతర మైనారిటీలు దాడులకు గురవడంపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. 

అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల సురక్షితను భారత్‌ కోరుకుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే యూనస్‌ఖాన్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. యూనస్‌ ఖాన్​ కూడా ఇటీవల మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న దాడులపై ఓ కార్యక్రమంలో స్పందించారు. 

“హక్కులు అందరికీ సమానం. మానవులంతా ఒకటే. మన హక్కులు ఒకటే. మన మధ్య భేదాలకు తావు లేదు. దయచేసి సంయమనం పాటించండి. సమస్యల పరిష్కారంలో విఫలమైతే విమర్శించండి”  అని స్పష్టం చేశారు.  “మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషులమే. సంస్థాగత ఏర్పాట్లలో లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మోదీకి ఫోన్​​ చేసి హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ విషయంపై హామీ ఇచ్చారు.