రాహుల్‌ భారత పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టుకు డా. స్వామి

రాహుల్‌ భారత పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టుకు డా. స్వామి
లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ భారత పౌరసత్వం  అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందింగా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

2003లో యునైటెడ్ కింగ్‌డమ్‌ లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు, సెక్రటరీలలో రాహుల్‌గాంధీ ఒకరని తెలియజేస్తూ 2019లో కేంద్రం హోంశాఖకు సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. 2005 అక్టోబర్ 10, 2006 అక్టోబర్ 31 తేదీల్లో ఆ సంస్థ దాఖలు చేసిన రిటర్న్స్‌లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి ఆ లేఖలో పేర్కొన్నారు.

2009 ఫిబ్రవరి 17న ఆ కంపెనీని రద్దు చేసినప్పుడు చేసుకున్న దరఖాస్తులోనూ రాహుల్‌గాంధీ బ్రిటిష్ జాతీయతను మరోసారి ప్రకటించినట్టు స్వామి ఎంహెచ్ఏ దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం 1955ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్టు స్వామి ఆరోపించారు. 

దీనిపై 15 రోజుల్లోగా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతూ 2019 ఏప్రిల్ 29న రాహుల్‌గాంధీకి హోం శాఖ లేఖ రాసింది. హోంశాఖ లేఖ రాసి ఐదేళ్లయినా ఇంతవరకు రాహుల్‌గాంధీ నుంచి ఎలాంటి సమాధానం లేదని స్వామి ఆరోపించారు.