బాగా శిక్షణ పొందిన విదేశీ ఉగ్రవాదులను పంపుతున్న పాక్

బాగా శిక్షణ పొందిన విదేశీ ఉగ్రవాదులను పంపుతున్న పాక్
భద్రతా పరిస్థితిని అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్‌లోకి నెట్టితోందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశపు దుర్మార్గపు ఎత్తుగడలను విఫలం చేయడానికి ఒక వ్యూహాన్ని రూపొందించామని, భద్రతా బలగాలను తిరిగి మోహరిస్తున్నామని ఆయన వెల్లడించారు.
 
“రాబోయే మూడు నెలల్లో పరిస్థితిలో పెద్ద మార్పు” ఉంటుందని ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశారు.  గతంలో శాంతియుత వాతావరణానికి పేరుగాంచిన జమ్మూ ప్రాంతం, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద సంఘటనలు పెరిగాయి. గత కొన్ని నెలలుగా కతువాలో ఐఎఫ్  కాన్వాయ్, యాత్రికుల బస్సుపై దాడులు, సైనికుల తీవ్రమవుతున్న ముప్పును సూచిస్తున్నాయి.
 
 శనివారం, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. జమ్మూ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడులను సిన్హా ప్రస్తావిస్తూ “సంఘటనలు బాధాకరమైనవి, మేము వాటిని గుర్తించాము. జమ్మూ కాశ్మీర్, దేశ ప్రజలకు ఈ సంఘటనలను ఖచ్చితంగా నియంత్రించగలమని హామీ ఇస్తున్నాము” అని చెప్పారు. 
 
పొరుగు దేశం తన దుష్ట ఎత్తుగడలతో విజయం సాధించదని ఆయన స్పష్టం చేశారు. “పాకిస్తాన్ ఉగ్రవాదానికి జన్మస్థలం. అది అక్కడ నుండి ఉద్భవించింది. భారతదేశం, జమ్మూ కాశ్మీర్ పరిపాలన దానిని ఎదుర్కోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ ప్రయత్నాలకు అనేక ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయి” అని ఆయన చెప్పారు.
 
పరిస్థితిని నియంత్రించడంలో ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపై మనోజ్ సిన్హా పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు  “రాబోయే వ్యక్తం చేశారు. భద్రతా బలగాలు తమ సన్నాహాలను పూర్తి చేశాయని, ఈ ఉగ్ర ఘటనలను ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. “(కేంద్ర) హోంమంత్రి వ్యూహాన్ని సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మంచి ఫలితాలు కనిపిస్తాయని నేను భావిస్తున్నాను” అని ఆయన చెప్పారు.
 
జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ సమస్యలు సుర్ష్టిస్తుండటం కొనసాగడంపై వ్యాఖ్యానించాల్సిందిగా కోరగా.. ‘పాకిస్థాన్‌లోని అంతర్గత పరిస్థితులపై మాకు అవగాహన లేనట్లు కనిపిస్తోంది. ఆ దేశం తన సొంత ప్రజలకు ఆహారం కూడా అందించదు. దీని కారణంగా తమ ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు జమ్మూ కాశ్మీర్‌ లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని తెలిపారు. 
 
“భారత్‌ను యుద్ధాల్లో ఓడించడంలో ఆ  దేశం విఫలమైంది; అందుకే, ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా, భారతదేశానికి మద్దతు పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా,  మన దృక్కోణానికి భిన్నంగా అభిప్రాయాలు ఉన్న దేశాలు కూడా మన వైఖరిని అంగీకరించాయి. ఇది భారతదేశ అంతర్గత విషయంగా అంగీకరించాయి” అని మనోజ్ సిన్హా గుర్తు చేశారు. 
 
పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ ఎస్ జి) ద్వారా శిక్షణ పొందిన వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలను ఇంజనీర్ చేయడానికి చొరబడుతున్నారనే వాదనలపై ఒక ప్రశ్నకు, అత్యంత శిక్షణ పొందిన విదేశీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోకి చొరబడ్డారని సిన్హా అంగీకరించారు. “ఇది సున్నితమైన అంశం. ఈ విషయాల గురించి పత్రికలలో మాట్లాడటం సరికాదు. ప్రతి విషయాన్ని బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే, ఇటువైపు చొరబడిన వారు నిజంగా చాలా శిక్షణ పొందినవారు” అని ఆయన చప్పారు.
 
“మీరు పేర్కొన్న సమాచారం పాక్షికంగా నిజం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వద్ద మరింత సమాచారం ఉంది. పొరుగు దేశం ఏమి ప్రయత్నించినప్పటికీ, వారు తమ ఎత్త్తుగడలలో విజయం సాధించలేరు” అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. “సమగ్ర వ్యూహంతో చొరబడిన వారిని తొలగిస్తారు. సెక్యూరిటీ గ్రిడ్‌ను పటిష్టం చేస్తున్నారు, తద్వారా పరిస్థితిలో పూర్తి మార్పు వస్తుంది. స్థలాకృతికి అనుగుణంగా భద్రతా బలగాలు మైదానంలో తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి” అని చెప్పారు. 
 
మొత్తం మీద గత 15 నుండి 16 సంవత్సరాలుగా జమ్మూ ప్రాంతం ప్రశాంతంగా ఉందని, అయితే మన పొరుగుదేశం శాంతియుతంగా లేదని ఆయన తెలిపారు.” “ఎన్నికలు శాంతియుతంగా (ఇక్కడ) జరిగి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తే, అది సహజంగానే (పాకిస్తాన్‌కు) నొప్పిని కలిగిస్తుంది. గణాంకపరంగా, మీరు భద్రతా సిబ్బంది లేదా మరణించిన పౌరుల గణాంకాలను పోల్చినట్లయితే, గణనీయమైన తగ్గుదల కనిపించింది” అని చెప్పారు.
 
 “పేరున్న ఏ సంస్థ టాప్ కమాండర్లు ఇప్పుడు సజీవంగా లేరు. స్థానిక రిక్రూట్‌మెంట్ (ఉగ్రవాద గ్రూపుల ద్వారా) దాదాపుగా ఆగిపోవడాన్ని నేను ఒక పెద్ద విజయంగా భావిస్తున్నాను. ఇప్పుడు, ఇరుగుపొరుగు ఉగ్రవాదులను ఇక్కడకు చొప్పించడం ద్వారా పరిస్థితిని మరింత దిగజార్చాలని పొరుగుదేశం కోరుకొంటుంది” అని మనోజ్ సిన్హా తెలిపారు. జమ్మూ ప్రాంతంలో ఇటీవలి కాలంలో మూడు, నాలుగు ఉగ్రదాడి ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతూ ఇది చాలా దురదృష్టకరం అని చెప్పారు.