సెబీ చైర్‌పర్సన్‌ బచ్‌పై హిండెన్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు

సెబీ చైర్‌పర్సన్‌ బచ్‌పై హిండెన్‌బర్గ్‌  సంచలన ఆరోపణలు
అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ మరోసారి భారత పారిశ్రామిక రంగంపై సంచలన ఆరోపణలు చేసింది.‘సమ్‌ థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఏకంగా భారత స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌ లక్ష్యంగా ప్రధాన ఆరోపణలు గుప్పించింది.
 
గతేడాది అదానీ గ్రూప్​పై కీలక నివేదిక విడుదల చేసి స్టాక్​ మార్కెట్​ల పతనానికి కారణామైన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా సెబీ చీఫ్​ మాధవి పురి బచ్​, ఆమె భర్తపై సంచలనం ఆరోపణలు చేసింది. గతంలో తాము బయటపెట్టిన అదానీ గ్రూప్‌ కుంభకోణానికి కొనసాగింపుగా గౌతమ్‌ అదానీకి చెందిన విదేశీ డొల్ల కంపెనీల్లో ఆమెకు, ఆమె భర్తకు వాటాలున్నట్టు పేర్కొన్నది. 
 
అందుకే అదానీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించడానికి పూరీ ఆశ్చర్యకర రీతిలో ఆసక్తి కనబర్చారని కూడా చెప్పింది. నిజానికి నియంత్రణ పరమైన నిర్ణయాలు కంపెనీకి అనుకూలంగా తీసుకుంటారని తాము ముందే గుర్తించినట్టు తెలిపింది. ప్రస్తుతం పురి, ఆమె భర్త ధవల్‌ బచ్‌కు బెర్ముడా, మారిషస్‌ల్లోని ఫండ్లలో రహస్య వాటాలున్నట్టు హిండెన్‌బర్గ్‌ ఆరోపిస్తున్నది.జూన్‌ 5, 2015లో సింగపూర్‌లో ఐపీఈ ప్లస్‌ ఫండ్‌ కోసం అక్కడి బ్యాంకులో ఖాతాను తెరిచారని ఓ విజిల్‌ బ్లోయర్‌ డాక్యుమెంట్‌లో పేర్కొంది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నిర్వహిస్తున్న సంస్థల నుంచి 10 మిలియన్‌ డాలర్ల నిధులు మళ్లింపు జరిగిందనీ ఆరోపిస్తున్నది. ఈ నిధులు సెబీ చైర్‌పర్సన్‌ సింగపూర్‌ ఖాతాలోకి బదిలీ అయ్యాయని అంటుండటం గమనార్హం.

గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌.. 18 నెలల తర్వాత మళ్లీ అదే గ్రూప్‌ లక్ష్యంగా మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూపు కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ నాడు చేసిన ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. 

దీనిపై దర్యాప్తు చేపట్టిన మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ.. హిండెన్‌ బర్గ్‌ నివేదికను తప్పుబట్టడంతోపాటు దేశీయ మార్కెట్లను అస్థిర పరచడానికి జరిగిన ప్రయత్నంగా కొట్టిపారేసింది. హిండెన్‌బర్గ్‌.. తమ నివేదికను కొన్ని కంపెనీలతో పంచుకొని తద్వారా వచ్చిన లాభాల్లో వాటాలు తీసుకున్నదని ఆరోపించింది. అంతేగాక నిబంధనల ఉల్లంఘనల కింద 2 నెలల క్రితం నోటీసులనూ జారీ చేసింది.

కాగా, హిండెన్​బర్గ్​ ఆరోపణలను సెబీ చీఫ్​ మాధవి పురి బచ్​, ఆమె భర్త ధవల్​ బచ్​లు ఖండించారు. తమ జీవితాలు, ఆర్థిక పరిస్థితులు తెరిచిన పుస్తకం లాంటివని హిండెన్​బర్గ్​ ఆరోపణల్లో నిజం లేదని వెల్లడించారు. అవసరమైతే అన్ని పత్రాలను సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.