* భారత్ రిటైలర్ల కష్టాన్ని సొమ్ము చేసుకునేందుకే ఆరోపణలు
సెబీలో పూర్తికాల సభ్యురాలిగా చేరడానికి రెండేండ్ల ముందే తాము హిండెన్ బర్గ్ పేర్కొన్న పెట్టుబడులు పెట్టినట్లు సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్ వెల్లడించారు. అయితే ఇప్పుడు మార్కెట్ ను నియంత్రించే సెబీ విశ్వసనీయతను, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకే పనిగట్టుకుని ఆ సంస్థ ఈ ఆరోపణలు చేస్తోందని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం దాటవేసేందుకే హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలకు దిగిందని ఆమె ఆరోపించారు.
పాఠశాల నుంచి ఐఐటీ ఢిల్లీలో విద్యాభ్యాసం వరకూ బాల్య స్నేహితుడైన అనిల్ అహుజా ఐపీఈ-ప్లస్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్‌గా ఉన్నందున తన భర్త ధావల్ బుచి గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ అనుబంధ విదేశీ సంస్థలో పెట్టుబడులు పెట్టారని ఆమె స్పష్టం చేశారు.
హిండెన్ బర్గ్ తన ప్రజా వేగు ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా చేసిన ఆరోపణలపై మాధాబీ పురీ బుచ్ 15- అంశాల వివరణను ఇచ్చారు. దశాబ్దాల పాటు స్ట్రాంగ్ ఇన్వెస్టింగ్ కెరీర్‌లో కొనసాగిన తన భర్త సిటీ బ్యాంక్, జేపీ మోర్గా, 3ఐ గ్రూప్ పీఎల్‌సీ ల్లో మాజీ ఉద్యోగిగా అనిల్ అహుజా ఉన్నందునే అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆమె పేర్కొన్నారు.
2018లో ఐపీఈ-ప్లస్ ఫండ్’లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఈ ఫండ్ సీఐఓగా అనిల్ అహుజా వైదొలగగానే తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు బుచ్ కుటుంభం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. సింగపూర్‌లో తాము సాధారణ పౌరులుగా జీవిస్తున్నప్పుడు 2015లో ఐపీఈ-ప్లస్ ఫండ్’లో పెట్టుబడులు పెట్టామని బుచ్ తెలిపారు.
బ్లాక్ స్టోన్ మద్దతుతో పని చేస్తున్న మైండ్ స్పేస్, నెక్సన్ సెలెక్ట్ ట్రస్ట్ లకు చెందిన ఆర్ఈఐటీ ఐపీఓకు సెబీ ఆమోదం లభించడాన్ని హిండెన్ బర్గ్ రీసెర్చ్ ప్రశ్నించింది. అదే సమయంలో బ్లాక్ స్టోన్ సంస్థలో సీనియర్ అడ్వైజర్‌గా ధావల్ బుచి నియామకానికి ఆమోదం లభించిందని గుర్తు చేసింది. సెబీ చైర్ పర్సన్ గా నియామకం కావడానికి ముందే బ్లాక్ స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీనియర్ అడ్వైజర్ గా ధావల్ బుచి నియమితులయ్యారని ఆమె తెలిపారు. బ్లాక్ స్టోన్ అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థలతో ధావల్ బుచి అనుబంధం కలిగి ఉండే అవకాశమే లేదని ఆమె స్పష్టం చేసింది.
కాగా, హిండెన్ బర్గ్ రీసెర్చ్ పై సీనియర్ న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సెబీ జారీ చేసిన నోటీసులకు స్పందించడానికి బదులు ‘సెబీ చైర్మన్ మాధాబి పురీ బుచ్’ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని తప్పు బట్టారు.
భారత స్టాక్ మార్కెట్లను అస్థిర పరిచేందుకే హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిందని ఆరోపించారు. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల్లో కొత్త దనమేమీ లేదని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై సీరియస్ అటెన్షన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
సెబీ జారీ చేసిన నోటీసులకు స్పందించక పోగా, యూఎస్ షార్ట్ షెల్లర్ ‘హిండెన్ బర్గ్’ సెబీ చైర్ పర్సన్‌ను అప్రతిష్ట పాల్జేసేందుకే ఆమెను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసిందని ఆరోపించారు. తద్వారా భారత రిటైల్ ఇన్వెస్టర్ల కష్టాన్ని డాలర్లుగా సొమ్ము చేసుకునేందుకు యూఎస్ షార్ట్ షెల్లర్ ప్రయత్నిస్తోందని మహేశ్ జెఠ్మలానీ మండిపడ్డారు. అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా వస్తున్న నివేదికల వెనుక రాజకీయ హస్తంపైనా విచారణ జరిపించాలని ఆయన గత నెల 19న డిమాండ్ చేశారు.
More Stories
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం
ఢిల్లీని వణికించిన భూకంపం