తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ జరిపాకే రీజినల్ రింగ్ రోడ్డు

తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ జరిపాకే రీజినల్ రింగ్ రోడ్డు
తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చాకే రింగురోడ్డు నిర్మాణం చేపడతామని కేంద్ర రవాదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టూ తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రూ. 17,000 కోట్ల విలువైన హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం మంజూరు చేశామని చెప్పారు.
 
లోక్‌సభలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ తామే చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఆ వ్యయంలో 50 శాతం భరిస్తామని స్పష్టం చేసిందని తెలిపారు. ప్రభుత్వం మారాక కొత్త ముఖ్యమంత్రి వచ్చి దీనిపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన తర్వాతే హైదరాబాద్‌ చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తామని పెక్రోన్నారు.
 
 హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు, జాతీయ రహదారి 765లోని హైదరాబాద్‌-శ్రీశైలం సెక్షన్‌ ప్రాజెక్టులు డీపీఆర్‌ దశలో ఉన్నట్లు వెల్లడించారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి విస్తరణకు నెల రోజుల్లోపు పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
 
కాగా, హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను మరింత అభివృద్ధి చేయటానికి రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నగరం చుట్టూ ఇప్పుడున్న ఔటర్ రింగు రోడ్డుకు 40. కి.మీ దూరం నుంచి ఈ ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి హోదా లభించటంతో పాటు నెంబర్ కేటాయించారు. 
 
దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌ ఖరారు కాగా త్వరలోనే ఆ భాగానికి కూడా జాతీయ రహదారి హోదా ఇచ్చి, నంబరు కేటాయించనున్నారు. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగ్‌దేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్‌ మీదుగా ప్రాతిపదించారు. గతంలో ఉత్తర భాగంగా పొడవును 158.64 కి.మీ ఉండగా, ఇటీవల 161.59 కి.మీ.కు పెంచారు. 
 
ఇక చౌటుప్పల్- నారాయణపూర్- శివన్నగూడ- ఆమన్‌గల్- షాద్‌నగర్- చేవెళ్ల- సంగారెడ్డి మీదుగా రెండో భాగమైన దక్షిణ భాగాన్ని నిర్మించనున్నారు. గతంలో 181.87 కి.మీ. ఉన్న ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను 189.20 కి.మీ.కు పెంచారు. మెుత్తంగా రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. కాగా, ఈ ప్రాజెక్టు పూర్తయితే సగం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.