ధ‌న్‌క‌ర్‌, జ‌యాబ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి మాట‌ల యుద్ధం

ధ‌న్‌క‌ర్‌, జ‌యాబ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి మాట‌ల యుద్ధం
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఎగువ సభలో అంశం జయా బచ్చన్‌ దుమారం రేపుతోంది. సభలో ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అని పిలవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎగువ సభలో ఇప్పటికే రెండు సార్లు ఈ అంశంపై జయా బచ్చన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆమెను చైర్మన్‌ అలా పిలవడాన్ని వ్యతిరేకించారు.
 
శుక్రవారం కూడా మరోసారి ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ పేరు రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభలో ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అని సంబోధించారు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తన సీటులో నుంచి లేచి ఈ అంశంపై చైర్మన్‌ తనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. జయా బచ్చన్‌కు తోటి సభ్యులు అండగా నిలిచారు. ఈ మేరకు చైర్మన్‌ తీరుకు నిరసనగా సోనియా గాంధీ సహా విపక్ష కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 
జ‌యా అమితాబ్ బచ్చ‌న్ మాట్లాడాల‌ని కోరుతూ చైర్మెన్ ధ‌న్‌క‌ర్ పిలిచారు. ఆ స‌మ‌యంలో లేచిన జ‌యా త‌న‌కు జయా అమితాబ్ బ‌చ్చ‌న్ అని పిలువాల‌ని లేదంటూ, తాను ఒక కళాకారిణి అని, శ‌రీర భాష‌ను అర్థం చేసుకోగ‌ల‌నని, మీ స్వ‌రం ఆమోద‌యోగ్యంగా లేదని చైర్మెన్‌ను ఆమె త‌ప్పుప‌ట్టారు.
 
దీంతో చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ సీరియ‌స్ అయ్యారు. “ఇక చాలు. మీరు ఎవ‌రైనా కావొచ్చు. కానీ స‌భా మ‌ర్యాద పాటించాలి. డైరెక్ట‌ర్ ఆధీనంలోనే న‌టులు ఉంటారు. మీరు సెల‌బ్రిటీవే కావొచ్చు. నాకే గుర్తింపు ఉంద‌న్న‌ భావ‌న‌లోనే ఉండ‌కండి” అంటూ హితవు చెప్పారు. తాము కూడా గుర్తింపుతోనే ఈ స్థాయికి వ‌చ్చిన‌ట్లు ధ‌న్‌క‌ర్ తీవ్ర స్వ‌రంలో చెప్పారు.
 
జగదీప్ ధంఖర్‌పై రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ చేసిన ఆరోపణల పట్ల కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈరోజు జరిగిన సంఘటన అత్యంత ఖండించదగినదని, ఒక విధంగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఘటనలను ఖండిస్తూ రాజ్యసభలో తీర్మానం చేయాలని కోరారు.

కాగా, గత నెల 29వ తేదీన సోమవారం చైర్‌లో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌.. జ‌యా బ‌చ్చన్‌ను మాట్లాడాల‌ని కోరుతూ.. శ్రీమ‌తి జ‌యా అమితాబ్ బ‌చ్చన్ జీ అని పిలిచారు. ఆ స‌మ‌యంలో మాట్లాడేందుకు లేచిన జ‌యా బ‌చ్చన్ కొంత ఆవేశానికి గుర‌య్యారు. స‌ర్‌, కేవ‌లం జ‌యా బ‌చ్చన్ అని పిలిస్తే స‌రిపోతుంద‌ని జ‌యా బ‌చ్చన్ చెప్పారు. 

అయితే, పార్లమెంట్ రికార్డుల్లో పూర్తి పేరు రాసి ఉంద‌ని, అందుకే జ‌యా అమితాబ్ బ‌చ్చన్ అని పిలువాల్సి వ‌చ్చింద‌ని డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ తెలిపారు. ఇది చాలా కొత్తగా ఉంద‌ని, భ‌ర్త పేరుతోనే మ‌హిళ‌కు గుర్తింపు వ‌స్తుందా? అని ఆమె ప్రశ్నించారు. మ‌హిళ‌ల‌కు స్వంతంగా ఉనికి లేదా? వాళ్లు స్వంతంగా ఏమీ సాధించ‌లేరా? అని బ‌చ్చన్ అడిగారు.

ఆ తర్వాత ఆగస్టు 3వ తేదీన కూడా సభలో జయా అమితాబ్‌ బచ్చన్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో అమితాబ్‌ పేరును జయా బచ్చన్‌ ప్రస్తావించారు. స్పీకర్‌ స్థానంలో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ కూర్చున్న సమయంలో జయా బచ్చన్‌ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్‌ బచ్చన్‌గా పరిచయం చేసుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసశాయి. జయా మాటలు వినగానే జగదీప్‌ ధన్‌ఖడ్‌ అయితే పగలబడి నవ్వారు.

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో జ‌యా మీడియాతో మాట్లాడుతూ.. చైర్మెన్ అన్‌-పార్ల‌మెంట‌రీ భాష మాట్లాడుతున్న‌ట్లు ఆరోపించారు. “నువ్వో న్యూసెన్స్, బుద్దీహీన్” అంటూ చైర్మెన్ తిడుతున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. సెల‌బ్రిటీ అయితే ఏంటీ, మేం ప‌ట్టించుకోమ‌ని కూడా జ‌గ‌దీప్ అన్నార‌ని ఆమె చెప్పారు. తాను ఎంపీని అని, ఇది త‌న‌కు అయిదో ట‌ర్మ్ అని, తాను మాట్లాడేది త‌న‌కు తెలుసు అని, పార్ల‌మెంట్‌లో అంద‌రు మాట్లాడుతున్న తీరు, గ‌తంలో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. చైర్మెన్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జ‌యా డిమాండ్ చేశారు.