ప్రతిపక్షాల అభ్యతరాలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బిల్లు

ప్రతిపక్షాల అభ్యతరాలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బిల్లు
* ఈ బిల్లును వ్యతిరేకించేవారిని ముస్లిం సమాజం క్షమించదు
 

ప్రతిపక్షాల భారీ అభ్యంతరాల మధ్య కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం వక్ఫ్ (సవరణ) బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు ఏ మత సంస్థ స్వేచ్ఛకు భంగం కలిగించేలా లేదని, రాజ్యాంగంలోని ఏ నిబంధనను ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు.  వక్ఫ్ సవరణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లును ‘విభజన’, ‘ముస్లిం వ్యతిరేకం’, ‘రాజ్యాంగ విరుద్ధం’ అని పలువురు ఇండియా కూటమి సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దీనిని పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.

 
ఈ బిల్లుపై ముస్లింల‌ను ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుదోవ పట్టిస్తున్న‌ట్లు  కిరెన్ రిజిజు ఆరోపించారు. నిన్నటి రాత్రి వ‌ర‌కు కూడా ముస్లిం బృందాలు ఈ బిల్లు గురించి త‌న‌ను క‌లిశార‌ని, వ‌క్ఫ్ బోర్డుల్లో మాఫియా రాజ్య‌మేలుతోంద‌ని కొంద‌రు ఎంపీలు ఫిర్యాదు చేశారని మంత్రి వెల్లడించాయిరు. వ‌క్ఫ్ బోర్డు బిల్లుకు కొంద‌రు ఎంపీలు వ్య‌క్తిగ‌త‌ మద్దతు ఇచ్చార‌ని, కానీ రాజకీయ కార‌ణాల వ‌ల్ల ఆ విష‌యాన్ని వాళ్లు బ‌హిరంగంగా చెప్ప‌లేక‌పోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
బిల్లు గురించి దేశ‌వ్యాప్తంగా విస్తృత చ‌ర్చ లు, సంప్ర‌దింపులు నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. స‌చార్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించిన‌ట్లు మంత్రి రిజిజు తెలిపారు. ఈ బిల్లుతో మ‌త‌ప‌ర‌మైన సంస్థ‌లో ఎవ‌రి జోక్యం ఉండ‌బోద‌ని స్పష్టం చేశారు.  తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందని తెలిపారు. 
 
వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామని చెబుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సరిగ్గా రూపొందించలేదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అందిరకీ ఒకేలా ఉండాలని, మతాలవారీ న్యాయం ఉండకూడదని హెచ్చరించారు. ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులను హరించడంలేదని, ముస్లిం సమాజంలో అందరికీ హక్కులు కల్పించే ఉద్దేశంతో ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు.
 
బిల్లుపై సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి కొట్టిపారవేసారు. 2014 తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని, ఎంతోమంది ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. 
 
అనేకమంది ముస్లిం పెద్దలు, ముస్లిం సంస్థలను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా బిల్లు తీసుకొచ్చినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ప్రజల అభిప్రాయాలు స్వీకరించామని గుర్తు చేశారు.  వక్ఫ్‌బోర్డుల పేరుతో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఎందరో ముస్లింలు తమ దృష్టికి తీసుకువచ్చారని, మాఫియా నాయకత్వంలో వక్ఫ్‌బోర్డులు నడుస్తున్నాయని చెప్పారని కేంద్ర మంత్రి వెల్లడించారు. వాళ్లపేర్లు తాను సభలో చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఎందరో సామాన్య ప్రజలతో మాట్లాడిన తర్వాత వక్ఫ్‌బోర్డు చట్టంలో సవరణలు తేవాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 
 
ఢిల్లీ, పాట్నా, లక్నో, జమ్ము-కశ్మీర్‌లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు.  ఏపీ, అస్సాం, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ముస్లిం సంస్థల ప్రతినిధులు వచ్చి వక్ఫ్‌బోర్డులో అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు చేశారని స్పష్టం చేశారు. వక్ఫ్‌బోర్డును కాపాడటంతో పాటు ఇప్పటివరకు అవకాశాలు పొందని ముస్లిం సమాజం అవకాశాలు పొందే విధంగా సవరణలు తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 
 
వక్ఫ్‌బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఈ విషయంలో విపక్షాలు రాజకీయం చేయవద్దని కిరణ్ రిజిజు కోరారు. ఈబిల్లును వ్యతిరేకించే వ్యక్తులను ముస్లిం సమాజం క్షమించదని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వ్యక్తులను సామాన్య ముస్లింలు ఎప్పటికీ గుర్తించుకుంటారని తెలిపారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడం సరికాదని హితవు చెప్పారు. ప్రతి సభ్యుడు ఈ బిల్లుకు మద్దతు తెలిపాలని కిరణ్ రిజిజు కోరారు. 
 
వక్ఫ్ చట్టంలో ప్రతిపాదిత మార్పుల వెనుక ప్రేరణ విభజన రాజకీయాలకు పాల్పడటమేనని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించగా, బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత లలన్ సింగ్ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రభుత్వానికి మద్దతు పలికారు.  ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థపై, రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ విమరించారు. 
 
తాము హిందువులమని, అదే సమయంలో ఇతర మతాల విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పారు. ‘‘మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు ఈ బిల్లు ప్రత్యేకం. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో భారత ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని మీకు అర్థం కావడం లేదు. ఇది ఫెడరల్ వ్యవస్థపై దాడి’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఈ  బిల్లు రాజ్యాంగంపై ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆయన ఆరోపించారు.
 
అయితే, ఇది ముస్లింలకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లు కాదని లలన్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా ఉంటుంది? పారదర్శకత కోసం ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. ప్రతిపక్షాలు ప్రధాన సమస్య నుండి పక్కదారి పడుతున్నారు.  ఇందిరాగాంధీ హత్య సమయంలో వేలాది మంది సిక్కులను ఎలా చంపారో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) వివరించాలి’’ అని లలన్ సింగ్ డిమాండ్ చేశారు. వారు ఇప్పుడు  మైనారిటీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.