జీఎస్టీ రాకముందు నుంచే భీమా ప్రీమియంలపై పన్ను 

జీఎస్టీ రాకముందు నుంచే భీమా ప్రీమియంలపై పన్ను 

జీఎస్టీ అమల్లోకి రాకముందు నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పై పన్ను విధిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై  బుధవారం ఆమె లోక్ సభలో స్పందిస్తూ ఆరోగ్య బీమాపై జీఎస్టీని తొలగించే సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని తెలిపారు.

‘నేను రెండు ముఖ్యమైన అంశాలను లేవనెత్తాలనుకుంటున్నాను. జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు మెడికల్ ఇన్సూరెన్స్ పై పన్ను ఉండేది. ఇది కొత్త విషయం కాదు. ఇది ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ నిరసన తెలుపుతున్న వారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా?’’ అని సీతారామన్ ప్రశ్నించారు.

లైఫ్, హెల్త్ బీమా ప్రీమియంల పేరుతో కేంద్రం రూ.24,529 కోట్లు వసూలు చేసిందని వచ్చిన ఓ వార్తాకథనం ఆధారంగా ఇప్పుడు నిరసనలు చేస్తున్నారని పేర్కొంటూ ఆ వార్తాకథనం పూర్తిగా తప్పు అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఇది తప్పు. చాలా తప్పుదోవ పట్టించేది. ఆరోగ్య భీమాపై వసూలు చేసే 18 శాతం జీఎస్టీ రేటులో 9 శాతం సీజీఎస్టీ, 9 శాతం ఎస్జీఎస్టీ ఉంటుంది. గత మూడేళ్లలో ఆరోగ్య బీమా ద్వారా వచ్చిన మొత్తం రూ.24,529 కోట్లలో సగం అంటే రూ.12,264 కోట్లు నేరుగా ఎస్జీఎస్టీ రూపంలో రాష్ట్రాలకు వెళ్లాయి. అవి కేంద్రానికి రావు” అని ఆర్థిక మంత్రి తెలిపారు. 

అంతేకాదు, ఆర్థిక సంఘం ఫార్ములా ప్రకారం పన్ను వికేంద్రీకరణలో భాగంగా ఆరోగ్య బీమాపై  జీఎస్టీ వసూళ్లలో కేంద్రం వాటాలో తిరిగి 41 శాతాన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కాగా, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ సంబంధిత సమస్యలను పరిష్కరించే అధికారం రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ కు ఉందని నిర్మల చెప్పారు. 

ప్రతిపక్షాలు కోరినట్లు ప్రతిపాదిత జీఎస్టీ సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టలేమని ఆమె స్పష్టం చేశారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ భవనం గేటు వద్ద ఆందోళన చేశారు. ఈ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయడం గమనార్హం.