* బంగ్లాదేశ్, మయన్మార్‌ల భూభాగాలతో సైనిక స్థావరం ఏర్పాటు యత్నం
ఎదురైనా నిరసనలను తట్టుకోలేక దేశాధినేతలు దేశం విడిచి పారిపోయిన 2021లో ఆఫ్ఘనిస్తాన్, 2022లో శ్రీలంకలలో కనిపించిన దృశ్యాల మాదిరిగానే నేడు బాంగ్లాదేశ్ లో దృశ్యాలు ఉన్నాయి. ఈ దేశాలలో కూడా దేశాధినేత సురక్షితమైన ప్రదేశాలకు పారిపోయారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు, అందుకు దారితీసిన కారణాలు వాటికన్నా భిన్నమైనప్పటికీ నిరసనలను, అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణచివేసే ప్రయత్నాలు ఎదురు తిరుగుతాయనే అంశం మాత్రం స్పష్టం అవుతుంది.
బాంగ్లాదేశ్ ను ఆర్థిక వృద్ధి వైపు నడిపించడం ద్వారా ఆ దేశానికి అంతర్జాతీయంగా ఓ గుర్తింపును షేక్ హసీనా తీసుకొచ్చారు. కానీ ప్రతిపక్షం, మీడియా, పౌర సమాజంపై కూడా విరుచుకుపడటంతో ఆమె కొంత అపఖ్యాతి పాలయ్యారు. ఆమె నిష్క్రమణ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారే అవకాశం ఉంది. వాస్తవానికి కరోనా మహమ్మారి నుండి ఇంకా ఆ దేశం కోలుకోలేదు. రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారనుందని భావిస్తున్న సమయంలో ఇటువంటి ఉపద్రవం ఎదురు కావడం ఆ దేశ భవిష్యత్ నే ప్రశ్నార్ధకం కావిస్తున్నది.
వాస్తవానికి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి హసీనా ముందే గ్రహించారు. గత మేలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ ఆమె వాఖ్యలు కూడా దేశారు. బంగ్లాదేశ్ భూభాగంలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక విదేశానికి అనుమతిస్తే, జనవరి 7న జరిగిన ఎన్నికలలో ఎటువంటి అవాంతరాలు లేకుండా తాను తిరిగి ఎన్నికయ్యేటట్లు చూస్తానని ఓ తెల్లజాతి వ్యక్తి తనముందో ప్రతిపాదన తీసుకు వచ్చారని ఆమె వెల్లడించారు.
తన అధికారిక నివాసం గణభబన్‌లో జరిగిన 14 పార్టీల సమావేశంలో పరిచయ ప్రసంగం చేస్తూ, “తెల్లవారి నుండి ఈ ఆఫర్ వచ్చింది. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగకుండా బీఎన్‌పీ కుట్ర పన్నింది” అంటూ ఆమె ఆరోపించారు. 2001లో అమెరికా బంగ్లాదేశ్ గ్యాస్‌ను భారత్‌కు విక్రయించేందుకు ముందుకొచ్చినప్పుడు కూడా తాను అదే విధంగా స్పందించానని చెప్పారు.
“నేను బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెనని స్పష్టంగా చెప్పాను. మేము మా విమోచన యుద్ధంలో గెలిచాము. దేశంలో కొంత భాగాన్ని అద్దెకు తీసుకొని లేదా మరొక దేశానికి అప్పగించి అధికారంలోకి రావాలని నేను కోరుకోవడం లేదు. నాకు అధికారం అవసరం లేదు. ,” అంటూ ఆమె స్పష్టం చేశారు.
అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటే అప్పుడే అధికారంలోకి వస్తామని ఆమె తేల్చి చెప్పారు. “అందరూ తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను” అని ఆమె చెబుతూ స్వదేశంలో, విదేశాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నానని, “కుట్ర ఇంకా కొనసాగుతోంది” అని ఆమె పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ను మరో తూర్పు తైమూర్‌గా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.
“తూర్పు తైమూర్ లాగా… వారు బంగ్లాదేశ్ [ఛటోగ్రామ్], మయన్మార్‌లలో కొంత భాగాన్ని తీసుకొని బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పరుచుకునే క్రైస్తవ దేశాన్ని సృష్టించాలి అనుకొంటున్నారు,” అని ఆమె వెల్లడించారు. పురాతన కాలం నుండి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ద్వారా వాణిజ్యం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
“చాలామంది ఈ భూభాగంపై దృష్టి సారించారు. ఇక్కడ ఎలాంటి వివాదాలు లేవు, వివాదాలు లేవు. నేను అలా జరగనివ్వను. ఇది కూడా నా నేరాలలో ఒకటి” అని ఆమె చెప్పారు. ప్రతిపాదిత ఎయిర్ బేస్ నుంచి ఏ దేశాన్ని టార్గెట్ చేస్తారు? అని హసీనా ప్రశ్నించారు. “ఇది ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించవచ్చు, కానీ అది కాదు. వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసు” అని ఆమె చెప్పారు.
ఆమె కూడా, “అవామీ లీగ్ ప్రభుత్వం ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంది. ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆందోళన చెందవద్దు. దేశ ప్రజలే మన బలం. ప్రజలు మనతో ఉంటేనే అధికారంలో ఉంటాం” అని ఆమె ప్రజల మద్దతుపై భరోసా వ్యక్తం చేశారు. 17 ఏళ్ల పదవీకాలం తర్వాత ఆమె నిష్క్రమణ అంటే భారతదేశం ఈ ప్రాంతంలో విశ్వసనీయ భాగస్వామిని కోల్పోయిందని అర్థం.
హసీనా భారతదేశానికి స్నేహితురాలు, బంగ్లాదేశ్ నుండి పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపులను ఎదుర్కోవడంలో న్యూఢిల్లీ ఆమెతో కలిసి పనిచేసింది. ఈ భాగస్వామ్యం రెండు దేశాలను దగ్గర చేసింది. న్యూఢిల్లీ అనేక ప్రాజెక్టుల కోసం ఢాకాకు సహాయాన్ని అందించింది. బంగ్లాదేశ్‌లో వారాల తరబడి అలజడి రేగడం తమ అంతర్గత వ్యవహారమని దాని చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ కల్లోల సమయంలో సహితం భారత్ ఆమెకు బాసటగా నిలిచింది.
ఆమె అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, పౌర సమాజం, ప్రతిపక్షం, మీడియాపై అణిచివేతను ప్రశ్నిస్తున్న పశ్చిమ దేశాలు భారత్ నోరుమెదపక పోవడం పట్ల అసంతృప్తితో ఉన్నాయి. పైగా, ఆమె సురక్షితంగా దేశం విడిచి రావడంలో సహితం భారత్ సహకారం అందించింది. గతంలో, బీఎన్‌పీ -జమాత్ లేదా సైన్యం నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని పాలించినప్పుడు, భారతదేశానికి దుర్లభమైన అనుభవాలు ఎదురయ్యేవి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు పనిచేసేవి. ఈ పరిస్థితి మళ్లీ తలెత్తవచ్చు.
ఒక వంక పాకిస్తాన్ సరిహద్దుల్లో, మరోవంక లడఖ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మన సేనలను మోహరింపింప చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు బాంగ్లాదేశ్ సరిహద్దుపై సహితం దృష్టి సారించడం మనకు కొంత భారంగా మారే అవకాశం ఉంది. మయన్మార్ సరిహద్దు కూడా చాలా అస్థిరంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి, కలహాలు చెలరేగేందుకు ఈ పరిస్థితులు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు