బంగ్లాదేశ్‌లో పరిస్థితులను గమనిస్తున్నాం

బంగ్లాదేశ్‌లో పరిస్థితులను గమనిస్తున్నాం
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ‘ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది’ అని చెబుతూ అక్కడ జరుగుతున్నరాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ వెల్లడించారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ పరిణామాలపై రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. బంగ్లాలో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
 
 అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు జులైలోనే స్వదేశానికి వచ్చేశారని చెప్పారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు.  పొరుగు దేశంతో భారత్ నిరంతరం పరిశీలిస్తూ, పరిణామాలపై అప్రమత్తంగా ఉన్నామని సభకు తెలియజేశారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌కు రావాలని కోరినట్లు ఆయన సభకు తెలియజేశారు.
 
అంతకుముందు రోజు జరిగిన అఖిలపక్ష సమావేశం తరువాత, పొరుగు దేశంలో “మైనారిటీల స్థితికి సంబంధించి ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది” అని కేంద్ర విదేశాంగ మంత్రి రాజ్యసభలో చెప్పారు. బంగ్లాదేశ్‌లో, విద్యార్థుల నిరసన సమన్వయకర్తలు పార్లమెంటును రద్దు చేయాలని, వీలైనంత త్వరగా కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారని వివరించారు.
 
“మా అవగాహన ఏమిటంటే, భద్రతా సంస్థల నాయకులతో సమావేశం తరువాత, ప్రధాని షేక్ హసీనా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. చాలా తక్కువ నోటీసుతో, తక్షణం భారతదేశానికి రావడానికి ఆమె ఆమోదాన్ని అభ్యర్థించింది. ఆమె నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు” అని ఆయన చెప్పారు.
 
“…మేము మా దౌత్య కార్యకలాపాల ద్వారా బంగ్లాదేశ్‌లోని భారతీయ సమాజంతో నిరంతరాయంగా సన్నిహితంగా ఉన్నాము. అక్కడ సుమారు 19,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని అంచనా. వారిలో దాదాపు 9000 మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు జూలైలో తిరిగి వచ్చారు… మేము మైనారిటీల స్థితికి సంబంధించి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నాము” అని వివరించారు.
 
అంతకుముందు పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి నేతలకు వివరించారు. భారత్ తన ఆర్మీని అప్రమత్తంగా ఉంచుతూ బంగ్లాదేశ్‌పై వేచి చూసే వ్యూహాన్ని కొనసాగిస్తోందని జైశంకర్ చెప్పారు. బంగ్లాదేశ్ పరిణామాలలో బయటి శక్తుల పాత్ర గురించి ప్రభుత్వం వద్ద ఏమైనా సమాచారం ఉందా? అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించగా, జైశంకర్ మాట్లాడుతూ, “పాకిస్తాన్ దౌత్యవేత్త మారిన డిపి గురించి మాత్రమే ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. తిరుగుబాటుకు మద్దతు అని వర్గాలు తెలిపాయి” అని తెలిపారు.
 
‘‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఈ రోజు పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వివరించాం. ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు‘‘ అని జయశంకర ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బంగ్లాదేశ్‌ పరిస్థితిపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి వివరించిందని కాంగ్రెస్‌ నేత కార్తి చిదంబరం తెలిపారు. జాతీయ భద్రత, ప్రయోజనాలకు సంబంధించినంతవరకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా ఉందని ఆయన మీడియాకు తెలిపారు.