ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆర్మీ హెలికాప్టర్‌లో బంగ్లాదేశ్ మీదుగా సోమవారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హసీనా ఆశ్రయం పొందుతున్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అయితే, తాజా సమాచారం మేరకు మరికొన్ని రోజులు ఆమె భారత్‌లోనే ఉండనున్నట్లు తెలిసింది. భారత ప్రభుత్వం కూడా అందుకు అనుమతిచ్చినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లా నుంచి ఢిల్లీ చేరుకున్న హసీనా ఇక్కడి నుంచి భారత్ సహకారంతో లండన్ వెళ్లాలని యోచించారు.
హసీనా రాజకీయ శరణార్థిగా యూకే వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆశ్రయం కోసం అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకూ ఆమె ఢిల్లీలో ఉండేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవంక, బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుతోపాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వివరిస్తున్నారు.
కాగా, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ ఇవాళ ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వాయిదా తీర్మానం ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిపై చర్చించాలని, ఆ దేశం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి చర్చించాలని ఆయన తన వాయిదా తీర్మానంలో కోరారు. ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి వాయిదా తీర్మానం ఇచ్చారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన