బంగ్లాదేశ్‌కు రైలు సర్వీసులు నిలిపివేత.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్

బంగ్లాదేశ్‌కు రైలు సర్వీసులు నిలిపివేత.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్

* భారత్‌-బంగ్లా మధ్య నిలిచిన వాణిజ్యం

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశానికి అన్ని రైలు సర్వీసులను భారతీయ రైల్వే సోమవారం నిలిపివేసింది. కోల్‌కత ఢాకా-కోల్‌కత మైత్రీ ఎక్స్‌ప్రెస్(13109/13110), కోల్‌కత-ఢాకా–కోల్‌కత మైత్రీ ఎక్స్‌ప్రెస్ (13107/ 13108), కోల్‌కత-ఖుల్న-కోల్‌కత బంధన్ ఎక్స్‌ప్రెస్, ఢాకా–న్యూ జల్పాయ్‌గురి–ఢాకా మిథాలీ ఎక్స్‌ప్రెస్‌లను సస్పెండ్ చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. 
 
కాగా, ఢాకాకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్‌ నుంచి రావాల్సిన ఎయిర్‌ ఇండియా సర్వీసులను నిలిపివేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి రావాల్సిన అన్ని ఇండిగో సర్వీసులను కూడా రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది
 
 బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరీ కోల్‌కతాకు చేరుకుని పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.  ప్రస్తుత పరిస్థితులపై బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌తో బీఎస్ఎఫ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి సాధారణంగానే ఉంది. బంగ్లాదేశ్లో కర్ఫ్యూ కారణంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల(ఐసీపీ) వద్ద రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. అక్రమ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి భద్రత, గస్తీని పెంచారు. సరైన పత్రాలు లేకుండా త్రిపురలోకి ప్రవేశించిన 12 మంది బంగ్లాదేశీయులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్‌-బంగ్లాదేశ్‌ వాణిజ్యంపై పడుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌లోని లాండ్‌ పోర్ట్‌ల వద్ద ఆ దేశ కస్టమ్స్‌ నుంచి క్లియరెన్స్‌ లేకపోవడం వల్ల అన్ని లాండ్‌ పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్‌ ఎగుమతిదారుల కోఆర్డినేషన్‌ కమిటీ సెక్రటరీ ఉజ్జల్‌ సాహ తెలిపారు. . దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. ఆసియాలో బంగ్లాదేశ్‌కు భారత్‌ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆఫీసును మూసేస్తున్నట్లు ఎల్ఐసీ సోమవారం ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీ వరకూ బంగ్లాదేశ్ లోని తమ ఆఫీసు మూసేస్తున్నట్లు సోమవారం ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్’లో తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆగస్టు ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.

నిరసనలు ఎక్కువ అవ్వడంతో జూలై మొదటి వారంలో భారతదేశం తన పౌరుల భద్రత కోసం ఢాకాలోని హైకమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. తదుపరి నోటీసు వచ్చే వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారత పౌరులకు సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయులు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని గట్టిగా చెప్పింది.

ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బయట తిరగొద్దని భారత్ హెచ్చరించింది. 8801958383679, 8801958383680, 8801937400591 అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా ఢాకాలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు జరపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హింసాత్మక ఘర్షణలు సాధారణ విద్యా సంవత్సరానికి అంతరాయం కలిగించడంతో బంగ్లాదేశ్‌లో చదువుతున్న భారత్, భూటాన్, నేపాల్‌లకు చెందిన దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు భారత్‌కు వచ్చారు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించేందుకు భారత్ నిరాకరించింది. హింసాత్మక నిరసనలను భారత్ ఎలా చూస్తుందనే ప్రశ్నకు సమాధానంగా ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంగా తాము చూస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.