రాష్ట్రాల్లో ఉగ్ర కుట్రలపై కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

రాష్ట్రాల్లో ఉగ్ర కుట్రలపై కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

రాష్ట్రాలలో ఉగ్ర కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా(ఐబి) వర్గాలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు దేశ వ్యాప్తంగా ఉగ్ర ప్రభావిత రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. ఇందులో భాగంగా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్ర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరో పలు సూచనలు చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమైయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఐఎ వర్గాలు ఉగ్రమూలాలపై ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. కేంద్ర హెచ్చరికలతో రాష్ట్రంలో పంద్రాగస్టు వేడుకలను భారీ భద్రత నడుమ నిర్వహించనున్నారు.

కేంద్ర నిఘా వర్గాల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. ఈక్రమంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా అధికం చేశారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించడంతో పాటు అత్యాధునిక సీసీ కెమెరాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

నెల 15 స్వాతంత్ర్య దినోత్సవాల వేడుకలలో ఉగ్ర కుట్ర జరిగే అవకాశం ఉందన్న అనుమానంలో భాగంగా దేశంలోని కేరళ, బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని ఎన్‌ఐఎ అధికారులు వివరిస్తున్నారు, నగరంలో ఐసిస్‌ కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ సైతం తనదైన శైలిలో రాష్ట్రంలోని అనుమానితులపై నిఘా సారిస్తున్నారు.

అదేవిధంగా ఈ సందర్భంగా సైనిక శిబిరాలు, కాన్వాయ్ లపై దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు సరిహద్దు అవతలి నుండి కొన్ని ఉగ్రవాద శక్తులు మనదేశంలోని వారికి ఆదేశాలు ఇస్తున్న టెలిఫోన్ సంభాషణలను నిఘావర్గాలు పసిగట్టాయి. మొదటిసారిగా దేశంలో ఉగ్రదాడులను పర్యవేక్షించే బాధ్యతను ఐఎస్ఐ ఎల్ఇటి కి అప్పగించినట్లు చెబుతున్నారు. ఇటీవలకాలంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లలో వరుస ఉగ్రదాడులు ఎల్ఇటి పాల్పడుతున్నది.

మరోవంక, స్వాతంత్ర దినోత్సవాలను బహిష్కరిస్తున్నట్లు వేర్పాటువాద బృందాలు పిలుపిచ్చింది నాలుగు ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలను చేబడుతున్నారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో భద్రతా వ్యవస్థలను కేంద్రం అప్రమత్తం చేసింది.