హమాస్‌ చీఫ్‌ హనియే హత్య

హమాస్‌ చీఫ్‌ హనియే హత్య
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్‌ సంస్థ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే హత్యకు గురయ్యారు. దాంతో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థనే ఈ హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్మాయిల్‌ హనియేను హతమారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు గతంలో ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

ఖతార్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్‌ హనియే ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్‌కు వెళ్లాడు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంకు హాజరైన కొద్దీ గంటల్లోనే బుధవారం తెల్లవారుజామున ఈ హత్య జరిగింది. ఈ విషయాన్నీ ఒక వంక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్, మరోవంక హమాస్ లు నిర్ధారించారు.

అయితే హనియేను ఎవరు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? వివరాలను ఇరాన్‌ ఇంకా వెల్లడించలేదు. కానీ, హనియే హత్యపై దర్యాప్తు జరుగుతున్నదనే విషయాన్ని మాత్రం ప్రకటించింది. ఇదిలావుంటే ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు ఇంతవరకు హనియే హత్యపై స్పందించలేదు. పరిస్థితులను అంచనా వేస్తున్నామని మాత్రం ఇజ్రాయిల్ సైన్యం పేర్కొన్నది.

అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, ఉద్రిక్తతలను తగ్గించడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తుందని, అయితే ఇజ్రాయెల్‌పై దాడి జరిగితే దానిని రక్షించడానికి అమెరికా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో ఘోరమైన దాడి వెనుక హిజ్బుల్లా కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొన్న 24 గంటలలోపే వచ్చిన వార్త, గాజాలో ఏదైనా ఆసన్నమైన కాల్పుల విరమణ ఒప్పందానికి వెనుకంజ వేసినట్లు కనిపిస్తోంది.

కాగా పాలస్తీనాలోని హమాస్‌ గ్రూప్‌కు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ హత్యకు గురికావడం ఆందోళనకరంగా మారింది. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా మారణహోమం కొనసాగుతుండటంతో హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేయించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ హనియే హత్యకు గురికావడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.