రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిలదీసిన మహిళా రైతులు

రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిలదీసిన మహిళా రైతులు

రైతుల పంట రుణ మాఫీపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ  పొన్నం గొప్పగా చెప్పేందుకు ప్రయత్నించగా ఓ మహిళా రైతు నిలదీసినంత పనిచేశారు. రూ. 1,50,000 వరకు రుణమాఫీ అయిందా? అంటూ ఆరా తీసిన మంత్రిని, రేషన్ కార్డు లేదని,  తన రూ. 80 వేల రుణం మాఫీ కాలేదని, అది ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. అవాక్కైన మంత్రి పొన్నం, మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు అందజేస్తే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.‌ రూ. 1.50 లక్షల రుణమాఫీ అయిన తర్వాత, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటనతో హల్ చల్ చేశారు. గతంలో కేసీఆర్ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నములకనూర్ గ్రామ శివారులో వరి నాట్లు వేస్తున్న రైతులను చూసి ఆగి పంట రుణమాఫీపై ఆరా తీశారు.

వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు.‌ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతుల పంట రుణాలు మాఫీ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే లక్ష , లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని చెప్పారు.‌ మీలో ఎంతమందికి రుణమాఫీ అయిందని ప్రశ్నించగా ఓ మహిళా రైతు తనకు రూ. 80 వేలు మాత్రమే రుణం ఉందని, రేషన్ కార్డు లేదని రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరి రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు? మా రుణమాఫీ ఎప్పుడైతదని ప్రశ్నించడంతో అవాక్కైన మంత్రి త్వరలోనే అందరికీ  రూ. 2 లక్షల వరకు మాఫీ అవుతుందని అంటూ జారుకున్నారు. ఒకవేళ ఇప్పుడు రుణమాఫీ కాని వారు వెంటనే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు.

గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని, ఇప్పుడు పంటల బీమా తో రైతులకు నష్టపరిహారం సైతం వస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, తమది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.