రైతులందరికీ రుణ మాఫీ చేస్తున్నట్టుగా రేవంత్ సర్కార్ ప్రగల్బాలు పలుకుతుంటే వేలాది రైతులు రుణమాఫీ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్లు చేస్తున్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
రుణమాఫీ కానీ రైతుల పక్షాన ఉద్యమించడానికి వారి వివరాలు సేకరించేందుకు బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రంలో బిజెపి కిసాన్ మోర్చా సహచరులతో కలిసి ఫిర్యాదులు ఫోన్ ద్వారా స్వీకరించిన కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా భేషరతుగా రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 567 పేరుతో అనేక ఆంక్షలు విధించి రైతులను రేవంత్ సర్కారు మోసం చేసిందని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు జీవో లో పేర్కొన్న ఆంక్షలు కారణంగా 30% రైతులకు మాత్రమే రుణమాఫీ అమలయ్యే అవకాశం ఉందని మిగతా రైతులకు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపేందుకు ప్రయత్నం చేస్తున్నదని శ్రీధర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన బాధిత రైతులకు అండగా నిలిచేందుకు ఆగస్టు 5 నుండి బిజెపి రైతు రచ్చబండ పేరుతో గ్రామాల వారీగా బాధిత రైతుల నుండి బిజెపి నాయకులు ఫిర్యాదులను స్వీకరిస్తారని ఆయన ప్రకటించారు. చిట్టచివరి రైతుకు న్యాయం జరిగే దాకా బిజెపి పోరాడుతుందని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
హెల్ప్ లైన్ ద్వారా వేలాది మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారని చెబుతూ వారందరికీ రుణమాఫీ అమలు అయ్యేంతవరకు బిజెపి విశ్రమించదని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జాడి రామరాజు అనురాధ, ఏలూరు నాగేశ్వరరావు తదితరులు హెల్ప్ లైన్ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో పాల్గొన్నారు.
More Stories
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు