
రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కార్యాలయంలో పలు కీలక ఫైల్స్ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ తప్పులను పట్టుకుని, కేసులు పెట్టేందుకు సీఆర్‌డీఏ ఫైల్స్‌ను అణువణువూ శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించడం లేదు.
దీంతో సీఆర్‌డీఏ పాలనా వ్యవహారాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక వ్యవహారాలపై ముందుకు వెళ్లేందుకు సీఆర్‌డీఏ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఫైళ్లు కనిపించని విషయం మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి కూడా వెళ్లింది.
ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్ ఇలా పలు విభాగాల ఫైల్స్ కనిపించడం లేదు. ఈ ఫైళ్లను టీడీపీ ప్రభుత్వంపై విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆయనను కేసులలో ఇరికించేందుకు సింగపూర్ దేశంతో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించిన ఫైళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
వీటిలో కూడా కొన్ని కనిపించటం లేదని తెలుస్తోంది. చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌లను ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో ఇరికించేందుకు భూ సంబంధిత ఫైళ్లన్నీ పట్టుకుపోయారు. వీటిలో కూడా చాలావరకు వెనక్కి రాలేదని తెలుస్తోంది. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు ఈ ఫైళ్లు ఇచ్చేశారు. ఈ ఫైళ్లకు సంబంధించిన కాపీలు అయినా తమ దగ్గర పెట్టుకోలేదు. ప్రస్తుతం సీఆర్డీఏకు కమిషనర్ నుంచి అడిషనల్ కమిషనర్ల వరకు అంతా కొత్తవాళ్లు వచ్చారు.
మిగిలిన ఫైళ్లు తెచ్చుకుందామంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. అమరావతి శాశ్వత రాజధాని పనులకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం తమకు ఉన్న అవగాహన మేరకు ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఫైళ్ల మాయం వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సీఆర్డీఏ ఉన్నతాధికారులతోపాటు, గతంలో పనిచేసిన వివిధ శాఖల అధికారులను బాధ్యులను చేసి, విచారించాల్సి ఉంది.
More Stories
తొలి దేశీయ డైవింగ్ సహాయక నౌక ‘నిస్తార్’ జల ప్రవేశం రేపే
ఓటర్ల జాబితాపై కాగ్ తో థర్డ్ పార్టీ ఆడిట్ కోరిన టిడిపి
టీటీడీలో విస్తరిస్తున్న శ్రీవారి సేవకుల సేవలు!