రాజధాని అమరావతి ప్రాంతంలో `నవ నగరాల’ నిర్మాణం

వైసీపీ పాలనలో ఆగిపోయిన రాజధాని అమరావతి పనులు పునరుద్ధరించేందుకు ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధాని పరిధిలో ‘నవ నగరాల’ నిర్మాణం జరగనుంది. సీఆర్డీయే పరిధిని యథాతథంగా కొనసాగించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సీఆర్డీయే 36వ అథారిటీ సమావేశం నిర్ణయించింది. 
దేశంలోని టాప్‌ 10లోని కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలోనే ఏర్పాటు కావాలని,  కరకట్టపై సెంట్రల్‌ డివైడర్‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై నాలుగు బ్రిడ్జీలు ఐకానిక్‌గా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జిపై మరోసారి అధ్యయనం చేస్తామని ఆయన తెలిపారు. 
సమీక్ష వివరాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మీడియాకు తెలిపారు.  ‘‘కోర్‌ క్యాపిటల్‌ సిటీ పరిధి 217 చదరపు కిలోమీటర్లు. సిటీలో తూర్పు నుంచి పడమరకు ఒక రహదారి గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తాం. ప్రతి కిలోమీటర్‌కు ఒక రోడ్డు ఉంటుంది. ఇందులో ఈ-5, 11, 13, 15 రోడ్లను నేషనల్‌ హైవేకు కలిపేలా చర్యలు తీసుకుంటాం. ఒక సంవత్సరంలో వాటిని పూర్తి చేస్తాం. కొండలు ఉన్న చోట వాటి పక్క నుంచి ఈరోడ్లను నేషనల్‌ హైవేకు కలపాలి” అని చెప్పారు. 
“అమరావతిలో నిర్మించే ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల ద్వారా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్‌ బ్రిడ్జిలు నిర్మిస్తాం. ఇప్పటికే నదిపై రెండు సాధారణ బ్రిడ్జీలు ఉండగా, మరొకటి త్వరలో అందుబాటులోకి వస్తుంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు కేంద్రం నిర్మిస్తే, ఇన్నర్‌ను మన ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతిలో వెస్ట్రన్‌, ఈస్ట్రన్‌ బైపా్‌సలు వస్తున్నాయి. ఇప్పటికే చేపట్టిన ఈస్ట్రన్‌ బైపాస్‌ రోడ్డు త్వరలో పూర్తి అవుతుంది’’  అని వివరించారు.
గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు జరిపారు. తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మరో రెండేళ్లపాటు గడువును పొడిగించారు. 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై ముందుకెళ్లాలి. భూసమీకరణకు సహకరించి భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును, భూమి లేని రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లు పొడిగించాలని సమావేశం నిర్ణయించింది.

‘‘8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీయే ఉండేలా గతంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండదు. ఆ పరిధిని గత ప్రభుత్వం 6993.24 చదరపు కిలోమీటర్లకు కుదించింది. అయితే పాతవిధానమే కొనసాగుతుంది. సీఆర్డీఏ నుంచి ఎక్కువ భాగం తీసేసి గత ప్రభుత్వం . పల్నాడు, బాపట్ల అథారిటీలు ఏర్పాటుచేసింది. ఆ అథారిటీలు ఉంటాయి. కానీ వాటిలోని సీఆర్డీఏ భాగాన్ని వెనక్కి తీసుకొంటాం’’’ అని నారాయణ స్పష్టం చేశారు.