సిబిఐకు ఢిల్లీ సివిల్స్‌ అభ్యర్ధుల మృతి కేసు

సిబిఐకు ఢిల్లీ సివిల్స్‌ అభ్యర్ధుల మృతి కేసు
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లో రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌లో వరదల కారణంగా ఇటీవల ముగ్గురు సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులు మరణించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్ధుల మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఈ ఘటన నేపధ్యంలో ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్ల పరిస్దితిపై అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. అక్రమంగా బేస్‌మెంట్స్‌లో కొనసాగుతున్న కోచింగ్‌ సెంటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కాగా, ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌ లో గల ఓ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.

రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్‌ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.