మెరుపు వరదలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలం

మెరుపు వరదలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలం
మెరుపు వరదలు హిమాచల్‌ ప్రదేశ్‌ ను అతలాకుతలం చేశాయి. కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వరద విలయానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 50 మందికిపైగా గల్లంతయ్యారు. పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వరదలకు సమేజ్‌ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. గ్రామం కొట్టుకుపోయిన తీరును అనితా దేవి అనే మహిళ కళ్లకు కట్టినట్లు వివరించారు. ‘బుధవారం రాత్రి మేం నిద్రిస్తున్నాం. ఆ సమయంలో భారీగా శబ్దం వినిపించింది. మా ఇల్లు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో మేం నిద్రలోంచి లేచి బయటకు వెళ్లి చూసేసరికి ఊరు మొత్తం కొట్టుకుపోయింది’ అని తెలిపారు. 
 
`భయంతో మేమంతా వెంటనే గ్రామంలోని భగవతి కాళీ మాత ఆలయం వద్దకు చేరుకున్నాం. రాత్రంతా అక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఈ విధ్వంసంలో మా ఇల్లు మాత్రమే మిగిలింది. మిగతావన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయి’ అంటూ భావోద్వేగంతో వివరించింది.డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకారం కులు, మండి, సిమ్లా ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలకు సుమారు 53 మంది గల్లంతయ్యారు. ఇక ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరదల కారణంగా 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డీడీఎంఏ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు.

క్లౌడ్‌బ‌స్ట్ కారణంగా కులు-మనాలి హైవే ప‌లు ప్రాంతాల్లో దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌స్తుతం పున‌ర్ నిర్మాణ ప‌నులు జరుగుతున్నాయి. కొండ‌చ‌రియలు విరిగిప‌డ‌డం వ‌ల్ల‌  మూడు ప్రాంతాల్లో రూట్ల‌ను మూసివేశారు. చండీఘ‌డ్‌-మ‌నాలీ జాతీయ ర‌హ‌దారిపై రాత్రి రూట్ మూసివేశారు. క‌తౌలా, గోహ‌ర్ మీదుగా చిన్న వాహ‌నాల‌ను త‌ర‌లించారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని పంపిస్తున్నారు. రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతం వ‌ద్ద‌.. ఇరు వైపులా ప‌ర్యాట‌కులు నిలిచిపోయారు.

మండీ ఏఎస్పీ సాగ‌ర్ చంద‌ర్ మాట్లాడుతూ హైవేపై ఉన్న 5 మైల్‌, 6 మైల్ వ‌ద్ద రోడ్డును క్లియ‌ర్ చేసిన‌ట్లు చెప్పారు. కానీ 9 మైల్ వ‌ద్ద రోడ్డును రిపేర్ చేసేందుకు చాలా టైం ప‌డుతుంద‌ని తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు హైవేను క్లియ‌ర్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. దోడ్ నాలా, జోగిని మాతా ఆల‌యం రూట్లో ట్రాఫిక్ ఆల‌స్యంగా వెళ్తోంది. ర‌ద్దీని త‌గ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో వ‌న్‌వే ట్రాఫిక్‌ను అమ‌లు చేస్తున్నారు.