టిడిపికి ప్రతిష్టగా మారిన విశాఖ ఎమ్యెల్సీ ఎన్నిక!

టిడిపికి ప్రతిష్టగా మారిన విశాఖ ఎమ్యెల్సీ ఎన్నిక!

విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల కోటాలో ఈ నెల 30న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టగా మారనుంది.  స్థానిక సంస్థ‌ల్లో అత్య‌ధిక సీట్లున్న వైసీపీని ఎదుర్కొని ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి గెల‌వాల్సి ఉంది. ఒక‌వేళ ఓట‌మి చెందితే కూటమి ప్ర‌భుత్వానికి తొలి ప‌రాభ‌వం ఎదురైన‌ట్లే.  ఇటీవ‌లి తెలంగాణ‌లో కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇలా జ‌రిగింది. అధికారం కాంగ్రెస్ కాకుండా ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంది.

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన వైసీపీకి ఈ సీటు గెలుపొందటం అంటే ఆ పార్టీ శ్రేణులలో నైతిక స్థైర్యం నింపినట్లే కాగలదు.  అఖండ మెజార్టీ త‌రువాత జ‌రిగే తొలి ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని టీడీపీ కూట‌మి ప్ర‌య‌త్నిస్తుంది. అయితే ప్ర‌తిప‌క్ష వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో కూట‌మికి గెలుపు పెద్ద స‌వాల్‌గా ఉంది. ప్ర‌భుత్వం ఏర్పడి రెండున్న‌ర నెల‌ల‌కే జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌తిష్ఠాత్మ‌కం అయింది.

అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డం వైసీపీ అభినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉనికిని స‌వాల్‌గా మారింది. క‌నుక ఈ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లు అధికార టీడీపీ కూట‌మికి, ప్ర‌తిప‌క్ష వైసీపీకి స‌వాల్‌గా మారాయి. సంఖ్య బ‌లం బ‌ట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అత్య‌ధికంగా వైసీపీకి ఉన్నారు. . అయితే వారంతా వైసీపీ అభ్య‌ర్థికి ఓటేస్తారా? అనే మీమాంసం నెల‌కొంది. 

త‌క్కువ మంది స్థానిక సంస్థ‌ల స‌భ్యులున్న అధికార టీడీపీ గెల‌వ‌డానికి వైసీపీ స‌భ్యుల‌ను లాగాల్సి ఉంటుంది. టీడీపీ ఆ ప్ర‌య‌త్నాల‌ను మొద‌లు పెట్టింది. మరోవంక వైసీపీ నుంచి వ‌ల‌స‌ల‌ను నివారించ‌డానికి ఆ పార్టీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌లి జీవీఎంసీ వైసీపీ కార్పొరేట‌ర్లు టీడీపీ, జనసేనలలో చేరారు. దీంతో జీవీఎంసీని సొంతం చేసుకోవాల‌ని టీడీపీ కూట‌మి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. ఈ సంఖ్య బ‌లాన్ని ప‌రిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. 2020లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించిడంతో వైసీపీకి చెందిన వంశీకృష్ణ శ్రీ‌నివాస్ ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు. 

అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి రాజీనామా చేసి, జ‌న‌సేన‌లో చేరారు. జ‌న‌సేన త‌ర‌పున విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఏర్పడింది. అందుకనే ఈ స్థానాన్ని కాపాడుకొనేందుకు వైసిపి, దీనిని గెల్చుకోవడం ద్వారా ఉత్తరాంధ్రలో వైసిపి రాజకీయ ఉనికిపై దెబ్బ తీసేందుకు టిడిపి ప్రయత్నాలు ప్రారంభించాయి.

వైసిపి, టిడిపి అభ్యర్థులపై ఇంకా స్పష్టత ఏర్పడటం లేదు. టిడిపి తన మిత్రపక్షాలైన జనసేన, బిజెపిలకు ఈ సీటు వదిలివేస్తుందా? అనే అభిప్రాయం కలుగుతుంది. ఇటీవ‌లి రెండు ఎమ్మెల్సీకు ఒక‌టి టీడీపీ, ఒక‌టి జ‌న‌సేన తీసుకున్నాయి. ఇప్పుడు బీజేపీకి ఇస్తారా? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా నెల‌కొంక‌ది.