
ఇటీవల దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైల్వేల భద్రతపై కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలో చోటు చేసుకుంటున్న రైల్వే ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని రైళ్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. తాజాగా గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు.
దేశంలోని అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ – ఏటీపీ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రైలు ప్రమాదాలను నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కవచ్ ఏర్పాటుకు నరేంద్ర మోదీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయంలో రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రస్తావించి ప్రతిపక్షంపై తీవ్ర ఎదురుదాడికి దిగారు. రైల్వేలు దేశానికి జీవనాధారమని పేర్కొన్న కేంద్రమంత్రి ఆర్థిక వ్యవస్థలో రైల్వేల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. దేశంలో నిత్యం దాదాపు 20 వేల రైళ్లు రాకపోకలు నిర్వహిస్తున్నాయని, 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా దేశంలోని అన్ని రైళ్లల్లో కవచ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని చెప్పారు. ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల పొడవునా కవచ్ వ్యవస్థ ప్రాజెక్ట్ ప్రారంభమైనట్లు తెలిపారు. 2024లో కవచ్ వెర్షన్ 4.0కి ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. గతంలో యూపీఏ హయాంలో దేశంలో రైల్వే వ్యవస్థ దారుణంగా ఉండేదని రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైళ్లలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వేల భద్రత, రక్షణ వ్యవస్థపై దృష్టి సారించిందని తెలిపారు. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికులను కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. 58 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక కిలోమీటర్ ట్రాక్‌కు కూడా వారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ నెలకొల్పలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు.
ప్రయాణీకుల భద్రతను గాలికొదిలేసిన వారు ఇప్పుడు సభలో అరుపులతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో రైలు ప్రమాదాలు 0.24 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయని చెప్పగానే బల్లలు చరిచారని, తాము రైలు ప్రమాదాలను 0.19 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గించినా తమను నిందిస్తున్నారని, ఈ రకంగా దేశాన్ని నడపగలమా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన ట్రోల్ ఆర్మీతో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రతి చిన్న విషయాన్ని అదనుగా తీసుకుని ప్రజల్లో భయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తన దుష్ప్రచారంతో రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే 2 కోట్ల మంది ప్రజల గుండెల్లో గుబులు రేపుతోందని, ప్రయాణీకులను భయపెట్టడమే ఆ పార్టీ ఉద్దేశమా అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రశ్నించారు.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవనని అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. మరోవైపు, దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులను అభివృద్ధి చేస్తోందని రైల్వే మంత్రి వివరించారు. తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్‌లో ఉందని.. వందేభారత్, అమృత్ భారత్, వందే మెట్రో, వందే స్లీపర్ రైళ్లు.. రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందించనున్నాయని తెలిపారు.
రైళ్లలో మూడింట రెండు వంతుల నాన్ ఏసీ కోచ్‌లు, మూడోవంతు ఏసీ కోచ్‌లు ఉంటాయని, జనరల్ కోచ్‌లకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ప్రతి మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో కనీసం 4 జనరల్ కోచ్‌లు ఉండేలా చూస్తామని చెప్పారు. ఇందుకోసం 2500 జనరల్ కోచ్‌లు త్వరలో సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు