ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమానాలు రద్దు

ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమానాలు రద్దు

భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా తాత్కాలికంగా ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. ఓ వైపు ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం జరుగుతుండగా, మధ్యలో హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యం చేసుకున్నాయి.

దీనితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్‌అవీవ్‌ నుంచి భారత్​కు వచ్చే విమానాలను, ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా స్పష్టం చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

‘పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆగస్ట్ 8 వరకు టెల్ అవీవ్‌కు షెడ్యూల్డ్ విమానాల ఆపరేషన్లు నిలిపివేసాం. పరిస్థితిని మేం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రయాణికులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నాం. టెల్ అవీవ్‌కు వెళ్లడానికి, అక్కడి నుంచి రావడానికి టిక్కెట్లు బుకింగ్‌ చేసుకున్న వారికి రీషెడ్యూలింగ్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై ఒకసారి మినహాయింపు లభిస్తుంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత మా మొదటి ప్రాధాన్యత’ అని పేర్కొంది.

ఆగస్టు 8వ తేదీ వరకు డిల్లీ-టెల్‌ అవీవ్‌ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు ప్రకటించింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్‌పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

డిల్లీ- టెల్‌ అవీవ్‌ మధ్య ఎయిర్‌ఇండియా వారానికి నాలుగు సర్వీసులనునడుపుతుంది. అయితే, గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరిపిన తర్వాత ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో, దాదాపు ఐదు నెలల పాటు టెల్‌ అవీవ్‌కు ఎయిర్​ఇండియా విమాన సర్వీసులను నిలిపివేసింది.

హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. మరోవైపు హమాస్‌ సైనిక విభాగాధిపతి మహమ్మద్‌ డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇక, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సీనియర్‌ మిలిటరీ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌ ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో మృతిచెందారు. 

ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌ భూభాగం దిశగా లెబనాన్‌ పలు రాకెట్లను ప్రయోగిస్తోంది. దానికి ఇజ్రాయెల్ నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇజ్రాయెల్​కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభయం కూడా ఇచ్చారు. దీనితో పరిస్థితి మరీ దారణంగా తయారవుతోంది.