ఉచిత సంస్కృతి కావాలో, సరైన మౌలిక సౌకర్యాలు కావాలో!

ఉచిత సంస్కృతి కావాలో, సరైన మౌలిక సౌకర్యాలు కావాలో!

* కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్ లోని ఐఎఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు యుపిఎస్‌సి విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై అధికారులను బాధ్యులను చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం మందలించింది. “ఉచితాల సంస్కృతి” కారణంగానే పన్నులు వసూలు కాక, మౌలిక సౌకర్యాల అభివృద్ధి లోటై ఇలాంటి విషాద సంఘటనలకు దారి తీస్తున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ సంఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు సూచించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఈ కేసు దర్యాప్తు అధికారి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తాత్కాలిక చీఫ్‌జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్‌రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ పోలీస్ చర్యల తీరును ఆక్షేపించింది.

“ఉచిత సంస్కృతి కావాలో, లేక సరైన మౌలిక సౌకర్యాలు కావాలో, మీరు చూడవలసిన అవసరం ఉంది. ఢిల్లీ జనాభా 3.3 కోట్లున్నా 6నుంచి 7 లక్షల మందికి సరిపడేలా ప్లాను చేశారు. మౌలిక సౌకర్యాలు విస్తరింప చేయకుంటే అనేక మంది ప్రజానీకానికి ఎలా సౌకర్యాలు సమకూర్చగలుగుతారు?వ్యవస్థలో ఏదో దుర్బుద్ధి ఉంది. పరిపాలనాధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించాలి ”అని కోర్టు సూచించింది.

కోచింగ్ సెంటర్ బయట కారు నడుపుతున్న వ్యక్తిపై ఢిల్లీ పోలీస్‌లు చర్య తీసుకున్నారని, కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులపై చర్యలు తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజేంద్ర నగర్ ప్రాంతం లోని డ్రైన్ల పైనున్న అన్ని ఆక్రమణలను శుక్రవారం లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.

“ఇది చాలా తీవ్ర సంఘటన. నగరంలో భారీ ఎత్తున మౌలిక సౌకర్యాల వైఫల్యం ” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో పౌర సంబంధ అధికారులు ఉన్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు జరగడం ఆందోళనకరం. బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమౌతున్నా సరైన డ్రైనేజీ సౌకర్యం ఉండడం లేదు” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 

“మీ అధికార యంత్రాంగం దివాళా తీసిందా? జీతాలు చెల్లించడానికి నిధులు లేకుంటే , మౌలిక సదుపాయాలను ఎలా అభివృద్ధి చేస్తారు” అని ధర్మాసనం ప్రశ్నించింది. జులై 24న సెల్లార్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది రుద్ర విక్రమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ విచారణ చేపట్టింది. 

నగరంలోని సెల్లార్లలో వందలాది లైబ్రరీలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ నగరంలో మంచినీళ్లు లేవని, సరఫరాకు కావలసిన నీరు అందడం లేదని ప్రజలు నిరసనలు, ఆందోళనలు సాగించిన నేపథ్యంలో మరునాడే నగరంలో వరదలు ముంచెత్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు పిటిషన్‌లో కక్షిదారుగా ఢిల్లీ పోలీస్‌ను హైకోర్టు చేర్చింది. దీనిపై ఆగస్టు 2న విచారణ చేపట్టనుంది.