విజయన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మూల్యం చెల్లిస్తున్న కేరళ

విజయన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మూల్యం చెల్లిస్తున్న కేరళ
కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన పకృతి విలయంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం నిర్లక్ష్య విధానం వల్ల కేరళ మూల్యం చెల్లిస్తోందని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి వి. మురళీధరన్ విమర్శించారు. జూలై 23, 24, 25, 26 తేదీలలో వాతావరణ శాఖతోపాటు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఆయన తెలిపారు. 
 
ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్లు పంపిందని, ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి సూచిందని ఆయన చెప్పారు. అయితే కేరళ ప్రభుత్వం ఈ హెచ్చరికలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇదే విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారని గుర్తు చేశారు. పైగా, వయనాడ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని గతంలో చాలా ఏజెన్సీలు అప్రమత్తం చేశాయని మురళీధరన్ తెలిపారు. 
 
జరుగబోయే విషాదం గురించి కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ 2020లోనే హెచ్చరించిందని చెప్పారు. అలాగే నాలుగు వేల కుటుంబాలను తరలించాలని సూచించిందని పేర్కొన్నారు. ‘కొండచరియలు విరిగిపడిన ముండక్కై గ్రామంలో 18 కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఒకటిగా జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికలో గుర్తించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ విధానం కారణంగా కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది’ అని ఆయన విమర్శించారు.మరోవైపు ఈ ప్రాంతాన్ని పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించినట్లు మురళీధరన్ తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో 300కు పైగా అక్రమ నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయని విమర్శించారు. వాటిని తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

కాగా, భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం ఉందని జూలై 23 నుంచి కేరళ రాష్ట్రాన్ని హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో అన్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్ ఈ వాదనను తోసిపుచ్చారు. వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన తర్వాతే రెడ్‌ అలెర్ట్‌లు జారీ అయ్యాయని చెప్పారు. ఒకరినొకరు నిందించుకునే సమయం ఇది కాదని తెలిపారు.