18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఝార్ఖండ్ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌

18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఝార్ఖండ్ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌
బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.  సభ నుంచి వెళ్లేందుకు ఆ ఎమ్మెల్యేలు నిరాకరించారు. దీంతో మార్షల్స్‌ బలవంతంగా వారిని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. జార్ఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో నిరసనకు దిగారు. 
 
పలు కీలక సమస్యలపై ప్రశ్నలకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించడంతో సభలో గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో మార్షల్స్‌ ద్వారా వారిని బయటకు పంపారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి అసెంబ్లీ లాబీలోనే నిద్రించారు. కాగా, గురువారం అసెంబ్లీ ప్రారంభం కాకముందు బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కొన్ని పత్రాలను చించివేశారు. దీంతో సభ ప్రారంభానికి ముందు అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. 

సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్‌ రవీంద్ర నాథ్ మహతో చర్యలు చేపట్టారు. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు సస్పెండ్‌ చేశారు. అయితే వారు సభ నుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

మరోవైపు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుందని, వారం రోజుల్లో నివేదికను తనకు అందజేస్తుందని స్పీకర్ వెల్లడించారు. అయితే  జార్ఖండ్‌లో నియంతృత్వం సాగుతోందని ప్రతిపక్ష నేత అమర్ బౌరీ ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఆయన స్పష్టం చేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగనున్నాయి.