యుపిలో కఠిన ‘లవ్ జిహాద్’ బిల్లు.. దోషులకు ఇక యావజ్జీవం

యుపిలో కఠిన ‘లవ్ జిహాద్’ బిల్లు.. దోషులకు ఇక యావజ్జీవం

బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. దీనిని లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం అని కూడా పిలుస్తారు, సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది.

సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. 

గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. 

ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థలను పరిశీలించరాదు. ఇవన్నీ నాన్-బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు.

నవంబర్ 2020లో దీని కోసం ఆర్డినెన్స్ జారీ చేయగా,  తరువాత, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉభయ సభలు బిల్లును ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం-2021 అమలులోకి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్ ఖన్నా సోమవారం బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

అయితే, మతపరమైన రాజకీయాల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, చట్టవిరుద్ధమైన మత మార్పిడి చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లుపై ప్రతిపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించాయి. బిల్లు గురించి అడిగినప్పుడు పార్లమెంటు వెలుపల విలేకరులతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “ఇంకేం ఉంది, వారు కొత్తగా ఏమీ చేయడం లేదు. మత రాజకీయాల ద్వారా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు” అంటూ ఆరోపించారు.

సమాజ్ వాదీ పార్టీతోనే మహిళల భద్రతకు తీవ్ర ముప్పు

కాగా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు’ పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మహిళలపై దాడుల కేసుల్లో ఉన్న వారంతా సమాజ్ వాదీ పార్టీ నేతలేనని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, బాలలపై లైంగిక దాడులను నివారించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా? అని యూపీ అసెంబ్లీలో ఎస్పీ సభ్యుడు రాగిణి సొంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యోగి ఆదిత్యనాథ్ ఈ ఆరోపణ చేశారు.

‘మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్ గా వ్యవహరిస్తున్నది. దాని ఫలితంగానే మహిళలు, బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయి. నేరస్తుల మనస్సుల్లో భయాందోళన కలిగించాం’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళల భద్రత పట్ల పూర్తిగా అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరిస్తున్నదని, ప్రతి కూతురు, వ్యాపార వేత్తకూ భద్రత కల్పించేందుకు కట్టుబడి పని చేస్తుందని స్పష్టం చేశారు.

2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే తమ తొలి చర్య అని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించిందే సమాజ్ వాదీ పార్టీ అని ఆరోపించారు. 2016లో ఎస్పీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని చెప్పారు.