శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. సాగర్ దిశగా కృష్ణా జలాలు

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. సాగర్ దిశగా కృష్ణా జలాలు
కృష్ణమ్మ శ్రీశైలాన్నీ దాటేసి నాగార్జున సాగర్‌ దిశగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో మూడు గేట్లు ఎత్తి, దిగువకు నీటిని వదిలిపెట్టారు. సాగర్‌లోకి 1.62లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా కృష్ణా బేసిన్‌లో జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. 
శ్రీశైలం నుంచి ఎగువన కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండినట్లే.
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో తెలంగాణ జెన్‌కోకు చెందిన 234 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రియదర్శిని జూరాల, 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లోయర్‌ జూరాల జలవిద్యుత్తు కేంద్రంతో పాటు 900 మెగావాట్లు కలిగిన శ్రీశైలం భూగర్భ జలవిద్యుదుత్పాదన పరుగులు పెడుతోంది.

సాగర్‌లో సోమవారం రాత్రి 9గంటలకు ఎనిమిది టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. గోదావరి బేసిన్‌లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16081 క్యూసెక్కుల వరద వస్తుండగా… ఈ ప్రాజెక్టు నుంచి 16 వేల క్యూసెక్కులను పంపింగ్‌ చేసి, మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు.  ఎల్లంపల్లి జలాశయం నుంచి రెండు టన్నెల్‌ల ద్వారా నందిమేడారంలోని పంప్‌హౌస్‌ సర్జ్‌పూల్‌కు నీటిని తరలించి, ఆ నీటిని నంది రిజర్వాయర్‌లో వేసి, అక్కడి నుంచి రామడుగు మండలంలోని లక్ష్మిపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి పంపింగ్‌ చేసి, మిడ్‌మానేరులో వేస్తున్నారు.

తొలుత మిడ్‌మానేరు, ఆ తర్వాత లోయర్‌ మానేరుకు నీటిని తరలించి, శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆన్‌లైన్‌ రిజర్వాయర్లు అయిన అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లను నీటితో నింపనున్నారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు కాస్తా వరద తగ్గుముఖం పట్టింది. 

మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు 1779 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా… నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 460 క్యూసెక్కులు, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు 17310 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 4860 క్యూసెక్కులు, ప్రాణహితపై ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి 5.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రాణహిత-ఇంద్రావతిపై సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి 8.56 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌(దుమ్ముగూడెం)కు 9.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. దాంతో ఈ బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది.

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తుతున్న సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పర్యాటకులు సోమవారం భారీగా శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని వదిలే దృశ్యాలను తమ సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తూ సందడి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.