ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్‌ కు ఢిల్లీ పోలీసుల నోటిస్!

ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్‌ కు ఢిల్లీ పోలీసుల నోటిస్!

* ఆమె తల్లిదండ్రుల ‘వైవాహిక స్థితి’ కోరిన కేంద్రం!

వివాదాస్ప‌ద ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్‌పై గత వారం నమోదైన మోసం, ఫోర్జరీ కేసులో విచారణలో చేరాల్సిందిగా ఢిల్లీ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేస్తారని బుధవారం అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు సేకరించడం ప్రారంభించారు.  ఖేద్కర్ తన సివిల్ సర్వీసెస్ పరీక్ష అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతుల (నాన్-క్రీమీ లేయర్) కోటాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ జూలై 19న ఆమెపై కేసు నమోదు చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( యూపీఎస్సీ) ఖేద్కర్‌పై పోలీసు కేసు నమోదు చేసింది. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలో మోసపూరితంగా తన గుర్తింపును పొందడం ద్వారా అనుమతించదగిన ప్రయత్నాల సంఖ్యను మించిపోయింది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ వివిధ ప్రభుత్వ శాఖల నుండి పత్రాలను సేకరించే పనిలో ఉంది. కంపైల్ చేసిన తర్వాత, ఖేద్కర్‌ను పిలిపించి, నకిలీ పత్రాలను ఆరోపించిన వారితో విచారిస్తారు.
 
కాగా, న‌కిలీ దివ్యాంగ‌, కుల ద్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన కేసులో స‌స్పెన్ష‌న్ ఎదుర్కొంటున్న ఆమె ముసోరిలోని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి అకాడ‌మీలో జూలై 23 లోగా రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ మంగ‌ళ‌వారం ఆమె అకాడ‌మీ వ‌ద్ద రిపోర్టు చేయ‌లేదు. వివాదం తీవ్ర కావ‌డంతో.. అకాడ‌మీకి రావాలంటూ రీకాల్ చేశారు. ఆమె శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని కూడా నిలిపి వేశారు. ఖేద్క‌ర్ కు చెందిన అన్ని డాక్యుమెంట్ల‌ను మ‌ళ్లీ ప‌రిశీలించేందుకు ఏక స‌భ్య క‌మిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
 
తాజాగా ఆమె తల్లిదండ్రుల “వైవాహిక స్థితి”పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. యూపీఎస్‌సీ పరిక్షల్లో ఓబీసీ నాన్-క్రీమీలేయర్ కోటా కోసం పూజా కేడ్కర్ తన తల్లిదండ్రులు విడిపోయారని క్లెయిమ్ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు కంటే తక్కువ ఉంటేనే ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ కోటా వర్తిస్తుంది. తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారని, తాను తన తల్లి దగ్గర ఉంటున్నారని పూజా కేడ్కర్ క్లెయిమ్ చేసుకున్నారు. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో క్లాస్ వన్ ఆఫీస్‌ర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్పష్టత కోసం ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై వివరాలు ఇవ్వాలని పుణె పోలీసులకు కేంద్రం ఆదేశాలిచ్చింది.
 
కాగా, ఖేడ్కర్ తల్లి మనోరమ క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. 2023లో ఒక భూ వివాదం కేసులో ఒక వ్యక్తిని ఆమె తుపాకీతో బెదిరించిందనే కారణంగా పుణె రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిటైర్డ్ ప్రభుత్వాధికారి అయిన ఖేడ్కర్ తండ్రి దిలీప్ కూడా ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అయితే ఆయనను జూలై 25వ తేదీ వరకూ అరెస్టు చేయకుండా పుణె కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది.
ఇలాఉండగా, పూజా ఖేద్కర్‌కు ఏడు శాతం లోకోమోటార్ వైకల్య సర్టిఫికేట్ జారీ చేసిన పుణె సమీపంలోని ఒక సివిక్ ఆసుపత్రి ఆ పత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉన్నదని, దాని జారీలో ఎటువంటి అక్రమమూ జరగలేదని తమ అంతర్గత దర్యాప్తులో కనుగొన్నట్లు సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలియజేశారు.